Venkaiah Naidu on Agri Reforms: దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపట్డారని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో రైతునేస్తం ఫౌండేషన్, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఉద్యాన శాస్త్రవేత్తలు, రైతులకు వెంకయ్యనాయుడు పురస్కారాలు ప్రదానం చేశారు.
ప్రకృతి వ్యవసాయం ఓ ప్రజా ఉద్యమంలా ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు అన్నారు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఉత్పత్తి బాగుంటుందన్న ఆయన.. ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలైనా ఒక్క వ్యవసాయ రంగమే నిలబడిందని కొనియాడారు. ఆ ఘనత సాధించిన రైతులకు జేజేలు పలకాలని సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతం కోసం శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు రైతులకు సహకరించాలని కోరారు. నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించాలని చెప్పారు. పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నగరాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ పంటలు.. మిద్దెతోటల రూపంలో పెంచుకోవాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.