మూత్రపిండాలు దెబ్బతిన్న రోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. అలా నెల్లూరు జిల్లాలోనూ నెల్లూరు నగరంతో పాటు ఆత్మకూరు, గూడూరు, వెంకటాచలం, తదితర ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నగరంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 166 యంత్రాలు ఉండగా.. 1,199 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వెంకటాచలం, గూడూరులో ఒక్కోచోట 10 చొప్పున 20 యంత్రాలు ఉండగా.. నెల్లూరు జీజీహెచ్‌లో 2 యంత్రాల ద్వారా సేవలందుతున్నాయి.
ఇదీ పరిస్థితి
ఆత్మకూరు వైద్యశాలలో ప్రస్తుతం ఉన్న 10 యంత్రాలు కాకుండా అదనంగా మరో 5 అవసరమని గుర్తించి అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు డయాలసిస్ చేయించుకుంటుండగా.. నెలకు ఈ లెక్క 600 నుంచి 700 వరకు ఉంటోంది. ఇంతటి కీలకమైన ఈ కేంద్రంలో ప్రధానంగా నీటి సమస్య వెంటాడుతోంది. రోజుకు దాదాపు 5 వేల లీటర్ల నీటిని బయట నుంచి తీసుకొస్తున్నారు. త్వరలోనే కేంద్రం కోసం బోరు వేస్తామని చెబుతున్నా.. అది ఎప్పటికి సాకారమవుతుందో తెలియని పరిస్థితి.
వెంకటాచలం కేంద్రాన్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో జీజీహెచ్, నారాయణ ఆసుపత్రులను కరోనా చికిత్సకు కేటాయించిన క్రమంలో వెంకటాచలం వైద్యశాలకు డయాలసిస్ కేంద్రాన్ని మార్చారు. ఇక్కడ రోగులకు భోజనం ఏర్పాటు కరవైంది. గంటల తరబడి చికిత్స కోసం వేచి చూసిన బాధితులు తిండికి ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఇంటినుంచే తెచ్చుకుంటున్నారు.