Ramdan celebrations:రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానికంగా ఉన్న ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ వేడుకలు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారని వక్తలు పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు చేపట్టామని ముస్లిం పెద్దలు తెలిపారు. ధనవంతులు, పేదవాళ్లన్న తేడా లేకుండా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు.
చిత్తూరు జిల్లా.. పలమనేరు ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోనిలో ఉన్న ఆయన శనివారం ఒక ప్రకటనలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆ అల్లా చల్లని చూపు చూడాలని, అందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ జిల్లా.. నందిగామలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు స్థానిక ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం సోదరులకు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసం. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు.