జిల్లావాసుల కలగా మిగిలిన ఓర్వకల్లు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలి. కేంద్ర అనుమతులతో సర్వీసులను నూతన సంవత్సరంలోనైనా అందుబాటులోకి తెచ్చేలా చర్చ జరగాలని ప్రజలు కోరుతున్నారు. 2017లో శ్రీకారం చుట్టిన విమానాశ్రయం పనులు కొలిక్కి వస్తున్న సమయంలో దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సర్వీసులతోపాటు యువతకు ఉద్యోగావకాశాలకు పైలెట్ శిక్షణ కేంద్రం, విమానాల మరమ్మతుల కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని చేసిన నిర్ణయాన్ని అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒకసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి
ఖరీఫ్‌లో వరుసగా కురిసిన వర్షాలతో రైతులు కుదేలయ్యారు. పంట కోతకు వచ్చే దశలో నివర్ ప్రభావంతో వర్షాలు కురిసి రూ.42 కోట్ల వరకు వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలకు సైతం రూ.15.56 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఈ పరిహారం వెంటనే చెల్లించేలా ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంది. 2018 ఖరీఫ్, 2019 రబీకి సంబంధించి కరవుతో పంటలకు నష్టం వాటిల్లగా... పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో పంట నష్టం రూ.650 కోట్లకుగాను, రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు సైతం వచ్చినట్లు సమాచారం. తీరా రైతులకు చేరే దశలో ఆ నిధులను నవరత్న పథకాలకు మళ్లించినట్లు విమర్శలున్నాయి. ఈ పరిహారం అందించాలని రెండేళ్లుగా అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
గుండ్రేవులకు అడుగులు పడేలా!
రాయలసీమ ప్రజల గుండెగా అభివర్ణించే గుండ్రేవులను ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ప్రభుత్వం చేర్చింది. రూ.4,330 కోట్లతో సమగ్ర నివేదిక సైతం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తుంగభద్ర నదిపై 20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటే కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరిచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై అడుగులు వేగంగా పడేలా ఎప్పటికప్పుడు చర్చిస్తేనే బాగుంటుందని వ్యవసాయ నిపుణులు, రైతులు కోరుతున్నారు.