ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పంచాయతీల ఆదాయం కోటి...అందుకే గట్టి పోటీ! - పత్తికొండ వార్తలు

ఆ పంచాయతీలకు పన్నుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘ నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులన్నీ కలిపి అవి ధనిక పంచాయతీలుగా ముద్ర వేసుకున్నాయి. జనాభా.. అభివృద్ధి... ఆదాయం విషయంలో పట్టణాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అందుకే ఈ సర్పంచి పీఠానికి ప్రస్తుత పల్లెపోరులో గట్టి పోటీ ఉంది. ఎలాగైనా ఆ పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అధికార పార్టీ ఏకగ్రీవానికి పావులు కదుపుతుంటే, ప్రతిపక్ష పార్టీ సమర్థులను బరిలో నిలిపే యత్నం చేస్తున్నారు. ఈ ధనిక పంచాయతీలు ఎక్కడో కాదు.. కర్నూలు జిల్లాలోనివి.

high revenue panchayath
ఆ పంచాయతీల ఆదాయం

By

Published : Feb 4, 2021, 4:59 PM IST

కర్నూలు జిల్లాలో 20 వేల ఓటర్లు దాటిన పంచాయతీలు పత్తికొండ, వెలుగోడు, బనగానపల్లి ఉన్నాయి. ఏటా రూ.కోటి దాటి ఆదాయం ఉన్న పంచాయతీలు ఎనిమిది ఉన్నాయి. ఈ ఎనిమిది పంచాయతీల్లోనూ మహిళలకే రిజర్వేషన్లు దక్కడం గమనార్హం. ఇందులో ఎస్సీ(మహిళ) ఆరు, ఎస్సీ(జనరల్‌) ఒకటి, ఎస్టీ(మహిళ) ఒకటి ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఉప సర్పంచి పదవులూ కీలకం కానున్నాయి.

పత్తికొండ..

పంచాయతీ ఓటర్లు: 20,421

మొత్తం ఆదాయం: రూ.3.73 కోట్లు

వనరుల ద్వారా: పన్నులు, అద్దెలు,

సంతలతో రూ.2.33 కోట్లు

ఆర్థిక సంఘ నిధులు: రూ.1.40 కోట్లు

రిజర్వేషన్‌: ఎస్సీ(మహిళ)

పల్లెపోరు తాజా పరిస్థితి..వైకాపాలో ఎమ్మెల్యే వర్గం, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ వర్గం మధ్య వర్గపోరు నడుస్తోంది. తెదేపా తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో కేఈ శ్యాంబాబు వ్యవహారాలు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తరహా రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

కోవెలకుంట్ల....

పంచాయతీ ఓటర్లు: 18,349

మొత్తం ఆదాయం: రూ.2.99 కోట్లు

వనరుల ద్వారా: పన్నులు, అద్దెలు,

వేలంపాటలు రూ.1.79 కోట్లు

ఆర్థిక సంఘ నిధులు: రూ.1.20 కోట్లు

రిజర్వేషన్‌: ఎస్సీ(మహిళ)

పల్లెపోరు తాజా పరిస్థితి: వైకాపాలో ఆశావహులు ఎక్కువయ్యారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఓ పారిశ్రామికవేత్తను డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని నమ్ముకుని ఉన్న మరో నాయకుడు భంగపాటుకు గురైనట్లు సమాచారం. తెదేపా మద్దతుతో బరిలోకి దిగనున్న ఓ మాజీ సర్పంచి సైతం వైకాపా తీర్థం పుచ్చుకుంటారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఏదేమైనా కోవెలకుంట్లలో గట్టి పోటీ నెలకొంది.

కోడుమూరు....

పంచాయతీ ఓటర్లు: 18,322

మొత్తం ఆదాయం: రూ.2.08 కోట్లు

వనరుల ద్వారా: ఇంటి, కుళాయి పన్నులు, సంతలు, అద్దెలు, వేలంపాటలు ద్వారా రూ.1.38 కోట్లు

ఆర్థిక సంఘ నిధులు:: రూ.70 లక్షలు

రిజర్వేషన్‌: ఎస్సీ(మహిళ)

పల్లెపోరు తాజా పరిస్థితి: తెదేపా ఇప్పటికే ఎస్సీ మహిళా అభ్యర్థిని ఎంపిక చేశారు. అధికార పార్టీ వైకాపాలో ఎమ్మెల్యే, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి రెండు వర్గాల నుంచి ఇద్దరు సర్పంచి అభ్యర్థికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పోటీ ఉత్కంఠ రేపుతోంది.

చాగలమర్రి...

పంచాయతీ ఓటర్లు: 15,774

మొత్తం ఆదాయం: రూ.1.80 కోట్లు

వనరుల ద్వారా: ఇంటి పన్నులు, కుళాయి, వాణిజ్య ప్రకటనల పన్ను, సంత మార్కెట్‌, దినసరి మార్కెట్‌, భవన సముదాయం పన్నుల రూపంలో ఏటా రూ.80 లక్షలు

ఆర్థిక సంఘ నిధులు: ఏటా రూ.కోటి

రిజర్వేషన్‌: ఎస్సీ(మహిళ)

పల్లెపోరు తాజా పరిస్థితి: వైకాపా-తెదేపా ఇరవై వార్డులకు, సర్పంచి అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపారు. తెదేపా తరఫున చాగలమర్రి తెదేపా మండల ప్రధాన కార్యదర్శి పుల్లయ్య కుమార్తె, బీటెక్‌ చదివిన కృష్ణవేణి నామినేషన్‌ వేశారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరం కానుంది.

శిరివెళ్ల

పంచాయతీ ఓటర్లు: 13,203, మొత్తం ఆదాయం: రూ.1.02 కోట్లు, వనరులు: కబేళా, వారపు సంత, దినసరి మార్కెట్‌, ఇంటి పన్నులు, కుళాయి పన్ను రూపంలో రూ.22 లక్షలు, ఆర్థిక సంఘ నిధులు: సుమారు రూ.80 లక్షలు, రిజర్వేషన్‌: ఎస్సీ(మహిళ), పల్లెపోరు తాజా పరిస్థితి: తెదేపా-వైకాపా పోటీలో అభ్యర్థులను నిలబెట్టారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అభ్యర్థి గెలుపును నిర్ణయించనున్నాయి. దీంతో మైనార్టీ యువకుడిని పెళ్లి చేసుకున్న ఎస్సీ యువతిని తెదేపా పోటీకి దించడంతో శిరివెళ్ల నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

అవుకు..

10వేల పైగా ఓటర్లు కలిగిన అవుకులో కూడా రూ.1.05 కోట్లు ఆదాయం వస్తోంది. ఇక్కడ దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి సంఘీభావంగా ఎలాంటి పోటీ పెట్టకూడదన్న నిర్ణయాలు వినిపిస్తున్నాయి.

బనగానపల్లి..

పంచాయతీ ఓటర్లు: 28,893

మొత్తం ఆదాయం: రూ.1.30 కోట్లు

వనరులు: రూ.70 లక్షలు

ఆర్థిక సంఘ నిధులు: రూ.60 లక్షలు

రిజర్వేషన్‌: ఎస్టీ(మహిళ)

పల్లెపోరు తాజా పరిస్థితి: గతంలో ఈ పంచాయతీ బీసీ(మహిళ)కు రిజర్వు అయింది. ప్రస్తుతం ఎస్టీ(మహిళ)కు రిజర్వేషన్‌ కావడంతో రెండు పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ఈ పంచాయతీని ఏకగ్రీవం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

వెలుగోడు....

పంచాయతీ ఓటర్లు: 20,211

మొత్తం ఆదాయం: రూ.1.67 కోట్లు

వనరులు: ఇంటి, కుళాయి, సంతలు, వేలాలు, అద్దెలు ద్వారా రూ.68.80 లక్షలు

ఆర్థిక సంఘ నిధులు: రూ.98.28 లక్షలు

రిజర్వేషన్‌: ఎస్సీ(జనరల్‌)

పల్లెపోరు తాజా పరిస్థితి: వెలుగోడు పంచాయతీలో వైకాపా, తెదేపా, భాజపా మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెదేపా మద్దతుతో నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఎస్సీ కాదంటూ భాజపా నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇదీ చదవండి: అన్ని స్థానాల్లో వైకాపా గెలుస్తుంది: మంత్రి బొత్స

ABOUT THE AUTHOR

...view details