Ex-TDP minister Bhuma Akhila Priya granted bail: తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో అరెస్టై, ప్రస్తుతం కర్నూలు మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు నంద్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండడంతో విషయం తెలుసుకున్న అఖిల ప్రియ కార్యకర్తలు, అభిమానులు కర్నూలుకు బయలుదేరారు.
మే 17న అఖిల ప్రియ దంపతులు అరెస్ట్..తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ నెల 16వ తేదీన కొత్తపల్లి వద్ద భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ అనుచరులు దాడి చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన అఖిల ప్రియ దంపతులను ఆళ్లగడ్డలో పోలీసులు అరెస్టు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజులపాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు.. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయగా.. మరోసారి మళ్లీ కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదులు పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసులు సైతం భూమా అఖిల ప్రియను కస్టడీ తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేశారు. కానీ, ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో భూమా అఖిల ప్రియ ఈరోజు సాయంత్రంకల్లా జైలు నుంచి విడుదలకానున్నారు. ఈ విషయం తెలుసుకున్న అఖిల ప్రియ కార్యకర్తలు, అభిమానులు కర్నూలుకు బయలుదేరారు.
అసలు ఏం జరిగిదంటే.. మే 16వ తేదీ రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దీంతో 17వ తేదీన కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ అనుచరులు, ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలు కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల ప్రియ దంపతులను ఆళ్లగడ్డలో పోలీసులు అరెస్టు చేసి, నంద్యాల కోర్టులో హాజరుపర్చారు. వారికి న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
ఇవీ చదవండి