VOTE MISTAKES : చనిపోయిన వాళ్లు తిరిగి వచ్చి ఓటు వేయగలరా..? ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధ్యమేనట. ఎందుకంటే పాతికేళ్ల కిందట ప్రాణాలు కోల్పోయిన వారికీ ఓట్లు కేటాయించారు. ఒకే ఇంటిలో వంద మందికి పైగా ఓట్లు ఉండటం సాధ్యమేనా? మన రాష్ట్రంలో అంతకుమించి అయినా ఉండగలరనే చెప్పాలి. ఎలా అంటే.... ఒకే ఇంటి నంబరు చిరునామాతో వందకు పైగా ఓట్లుకేటాయించారు. ఒక ఊరి ఓట్లు మరో ఊరిలో దర్శనమిస్తున్నాయి. ఓటర్ల ఫొటోలు ఉండాల్సిన చోట మార్కుల జాబితాలు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరుతో ఒకటికి మించి ఓట్లున్నాయి. ఒక మాజీ మంత్రికి అయితే ఏకంగా మూడు చోట్లు ఓట్లు ఉన్నాయి. తెలుగులో ఉండాల్సిన ఓటరు జాబితా అక్కడక్కడా... తమిళంలో దర్శనమిస్తోంది. ఇలా తవ్వేకొద్దీ ఓట్ల అక్రమాలు, అవకతవకలు, లోపాలు బయటపడుతూనే ఉన్నాయి.
అత్యంత అధ్వానంగా ఏపీ ఓటర్ల జాబితా తయారైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024లో భాగంగా ఎన్నికల సంఘం తలపెట్టిన ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ నిర్వహణను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈటీవీ-ఈనాడు బృందాలు పరిశీలించాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ఓటర్ల జాబితాల్లోని లోపాలు అనేకం బయటకొచ్చాయి. బీఎల్వోలు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా.. చాలాచోట్ల డుమ్మా కొట్టారు. మరికొన్నిచోట్ల అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల గేట్లకు ఓటర్ల జాబితాను వేలాడదీసి వదిలేశారు. ‘స్పెషల్ క్యాంపెయిన్ డే’ రెండురోజులూ మొక్కుబడిగా సాగింది. పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో స్థానికంగా లేనివారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగించారు. ఏళ్లతరబడి ఒకే చిరునామాలో ఉన్నవారి ఓట్లు మాత్రం పలుచోట్ల తీసేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఎన్జీవో కాలనీ 145 వ బూతులోఓటర్ జాబితా తమిళ అక్షరాలతోదర్శనమిచ్చింది. ఓటర్ పేర్లు తమిళ అక్షరాలతో ఉండటంతో అంతా అవాక్కయ్యారు.
ఓటరు జాబితాలో అవకతవకలు - ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు
మాజీ మంత్రి, వైసీపీఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మూడు ఓట్లు ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ ల్లో 111, 182, 191లో ఓటు హక్కు ఉంది. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ ఇవి ఉండగా …. బీల్ వోలు వాటిని సవరించకుండానే ఆలానే ఉంచారు. గతంలో 107, 177, 185 పోలింగ్ బూత్ లు గా ఉన్నాయి. ఇప్పుడు అవి 111, 182, 191గా మారాయి. నగర ఎమ్మెల్యే గ్రామీణ పరిధిలో మూడు ఉండటం ఈసీ పనితీరును తెలియజేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లాలో మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామం 124వ బూత్ లో మొత్తం 1,083 ఓట్లు ఉండగా వాటిల్లో 40 మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి. స్థానికంగా లేని 18 మందికి వలసదారులకు అదే బూతులో ఓటు హక్కు ఉంది.125వ బూత్‌లో మొత్తం వెయ్యి 81 ఓట్లు ఉండగా.... చనిపోయిన 18 మందికి ఓటు హక్కు ఉంది.126 వ బూత్ లో మృతి చెందిన 16 మంది ఇప్పటికి ఓటర్లుగానే ఉన్నారు. నరసరావుపేటలోని రామిరెడ్డి పేటలో వైకాపా మద్దతుదారులకు దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు.
తిరుపతి నియోజకవర్గంలో కొందరు ఓట్లు గల్లంతయ్యాయి. కుటుంబంలో పిల్లలకు ఓటు ఉన్నా ...పెద్దలవి లేకుండా చేశారు. మరికొందరివి చిరునామా మార్చమని కోరినా మార్చలేదు. తిరుపతిలో 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులు 30 మంది ఒకే ప్రాంతం నుంచి కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తు చేశారు. తిరుపతి నగరంలో కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేసిన గొల్ల శాంతి ఓటు ముసాయిదా జాబితాలో గల్లంతయింది. 236 పోలింగ్ బూత్ పరిధిలో తన ఓటు లేకపోవడం పై బీఎల్‍ఓను శాంతి నిలదీశారు.
ఎన్టీఆర్ జిల్లాలో రెండోరోజు ఓటర్ల జాబితాల పరిశీలన కార్యక్రమంలో పలు లోపాలు వెలుగు చూశాయి. మృతుల పేర్లను తొలగించలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారి వివరాలు ఉంచేయడం, ఒకరి పేరుతో రెండేసి ఓట్లు, చిరునమాలు తప్పుగా ముద్రించడం, ఒకే వ్యక్తికి తండ్రి పేరుతో ఒకటి, తల్లి పేరుతో ఒకటి చొప్పున రెండేసి ఓట్లు నమోదు అయ్యాయి. తిరువూరులోని 18వ వార్డులో రెండేసి ఓట్లు ఉన్నాయి. విజయవాడ మధ్య నియోజకవర్గంలోని మధురానగర్‌లో 168 నంబరు బూత్‌లో తండ్రీకుమారులకు రెండేసి ఓట్లున్నాయి. చందర్లపాడు మండలం తుర్లపాడులోని 46వ బూత్‌లో 43, 44 నంబర్లతో ఒకరికే రెండు ఓట్లు కేటాయించారు. నందిగామ మండలంలో పల్లగిరి, కమ్మవారిపాలెం, రాఘవాపురం గ్రామాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒకే పేరుతో రెండు ఓట్లు ఉన్నట్టు తేలింది. ప్రతి బూత్‌లో కనీసం ఐదారుగురు రెండేసి ఓట్లున్నవారున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చాలాచోట్ల బతికి ఉన్న వాళ్ల ఓట్లు గల్లంతయ్యాయి. కొందరి ఫోటోలు ఓటర్ల జాబితాలో సక్రమంగానే ఉన్నా పేర్లు మాత్రం మారిపోయాయి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్లకు ఓటు - బతికున్న వారికి వేటు
ప్రకాశం జిల్లా లో ఓట్లు జాబితా ప్రహసనంగా మారింది.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేరు జాబితాలో చేర్చనూలేదు. చని పోయిన వారిని తొలగించనూ లేదు. ముసాయిదా ఓటర్ల జాబితా అంతా తప్పులతడకలతో లోపాల పుట్టలుగా ఉన్నాయి. ఒంగోలు నగరంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కొత్తగా ఓటు కోసం అందజేసిన అర్జీల్లో మూడొంతులు జాబితాలో లేవు. నెల్లూరులో ఓట్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు రెండో రోజు కొనసాగాయి. కంసాలివీధికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి కుటుంబంలో నాలుగు ఓట్లు ఉండగా ఒక్కో ఓటు ఒక్కో డివిజన్ లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం 225వ నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా నమోదైన బుట్ట జాలమ్మ మరణించి పాతికేళ్లు దాటిపోయింది. అయినా ఆమె పేరు జాబితాలో ఉంది. ఇలా పదిమంది మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన గువ్వల గోవిందమ్మ, గువ్వల పెద్దన్న రెండేళ్ల కిందటే చనిపోయారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలో వారి పేర్లున్నాయి. సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె, పుట్లూరు,యల్లనూరు, బుక్కరాయసముద్రం మండలాల్లో మృతుల ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.సింగనమల మండలం వెస్ట్ నరసాపురం లో 8 ఏళ్ల క్రితం మృతి చెందిన వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయి. పులివెందుల 130, 131 పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితాలో 32 మంది మృతుల పేర్లున్నాయి. ఒంగోలులోని 88వ నంబరు పోలింగ్ కేంద్రంలో బూదూరి నారాయణ 2021లో కొవిడ్‌తో మృతిచెందారు. కానీ ఆయన ఓటు జాబితాలో ఉంది. ఇలా 79 మంది మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం 63వ పోలింగ్ కేంద్రంలో మృతుల ఓట్లు 60 ఉన్నాయని టీడీపీ అభ్యంతరం తెలపగా 11 మాత్రమే తీసేశారు. చంద్రగిరి నియోజకవర్గం గొడుగుచింత 171వ పోలింగ్ కేంద్రంలోనూ మృతుల ఓట్లు 13 ఉన్నాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 189వ నంబరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో చాన్నాళ్ల కిందటే మృతిచెందిన 46 మంది పేర్లున్నాయి. మరో 30 మంది ఓటర్లు ఎవరో కూడా తెలియదు. పాయకరావుపేట నియోజకవర్గం 69 నంబరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 31 మంది మృతుల పేర్లున్నాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని 130వ నంబరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో 40 మంది మృతుల పేర్లున్నాయి.
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరు పోలింగ్ కేంద్రం పరిధిలో 5-101 డోర్ నంబరుతో 101 ఓట్లు, 5-100 డోర్ నంబరుతో 30 ఓట్లు ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం నర్సింగపాడు పోలింగ్ కేంద్రం నంబరు-179లో.... 1-00 డోర్ నంబరుతో 54 ఓట్లున్నాయి. విశాఖ విశాఖ ఉత్తర నియోజకవర్గం 113వ నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలో 43-29-27/A డోర్ నంబరుతో 34 ఓట్లు, 49-29-28 డోర్ నంబరుతో 17 ఓట్లు ఉన్నాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాల్లో ఆసక్తికర విషయాలు మార్పులు చేయకుండానే
రాజాం నియోజకవర్గం వంగర మండలం ఎం.సీతారాంపురం గ్రామ ఓటర్ల జాబితాలో 0-00 డోర్ నంబరుతో 300 ఓట్లు నమోదుచేశారు. పోలవరం నియోజకవర్గం ప్రగడపల్లిలోని 259, 253వ నంబరు పోలింగ్ కేంద్రాల పరిధిలో సున్నా డోర్ నంబరుతో 36 ఓట్లున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరులోని 108వ నంబరు పోలింగ్ కేంద్రంలో 350 ఓట్లు 0 డోర్ నంబరుతో ఉన్నాయి. ఒంగోలు 86, 87 పోలింగ్ కేంద్రాల్లో వివరాలు తెలియని వ్యక్తుల పేరుతో 50కు పైగా ఓట్లున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలలోని 92, 96 పోలింగ్ కేంద్రాల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి ఓట్లు 204 వరకు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం జోడూరు పంచాయతీ దబ్బగూడకు చెందిన 21 మంది ఓట్లు.. పట్టుపురం పంచాయతీ రాజపురంలో ఉన్నాయి. బాణాపురానికి చెందిన 12 ఓట్లు జాడుపల్లిలో ఉన్నాయి. బాపట్ల జిల్లా నగరం మండలం చినమట్లపూడి పంచాయతీలో ఇతర గ్రామాల ఓటర్ల పేర్లున్నాయి. వాటిని తొలగించాలని స్థానికులు ఫిర్యాదుచేసినా ఇప్పటికీ తీయలేదు. బాపట్ల పటేల్‌నగర్‌లో నివసించే 90 మంది ఓట్లను వారికి కిలోమీటరు దూరంలో ఉండే 90వ నంబరు పోలింగ్ కేంద్రంలో చేర్చారు.
అమలాపురం కొంకాపల్లి మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో ఓటర్ల ఫొటోలకు బదులు ఆధార్ కార్డులు, మార్కుల జాబితాలు పొందుపరిచారు. కొంతమంది ఓటర్ల పేర్లు జాబితాలో ఫొటోలు లేకుండానే ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఓబుళంపల్లిలో కొంతమంది వైసీపీ మద్దతుదారులు 17 మందికి వేర్వేరు నియోజకవర్గాల్లో రెండేసి, మూడేసి ఓట్లున్నాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం కె.పాలవలసలోని 90, 91వ నంబరు పోలింగ్ కేంద్రాల పరిధిలో స్థానికంగా ఉండని 132 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరి పేర్లు తొలగించాలని గ్రామస్థులు ఫిర్యాదుచేసినా అధికారులు కొనసాగించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడుకు చెందిన 72మంది ఓటర్లు చిలకలూరిపేటలో ఓటర్లుగా చేరేందుకు ఫారం-6 దరఖాస్తులు పెట్టారు. వీరికి సంక్రాంతిపాడులో ఓట్లున్నా.. చిలకలూరిపేటలో దరఖాస్తు చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కర్నూలు జిల్లా 226వ కేంద్రంలో పవన్‌కుమార్ బోయ అనే వ్యక్తి ఫొటోకు బదులుగా ఆయన సోదరుడి ఫొటో పెట్టారు.ప్రత్తిపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని 175 నంబరు పోలింగ్ కేంద్రంలో బీఎల్వో ఉషారాణితో పాటు వాలంటీరు నాగలక్ష్మి పోలింగ్ కేంద్రంలో కూర్చున్నారు.
నెల్లూరులోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 11 గంటల వరకూ బీఎల్వోలు రాలేదు. కొంతమంది ఆ తర్వాత వచ్చినా మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వగ్రామం అమ్మపాలెంలోని పోలింగ్ కేంద్రం తలుపులే తెరవలేదు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి స్వగ్రామం మన్నసముద్రంలోని పోలింగ్ కేంద్రంలోనూ బీఎల్వోలు హాజరుకాలేదు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి, వాల్మీకిపురం విఠలం పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు హాజరుకాలేదు. వైయస్‌ఆర్ జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట, ప్రొద్దుటూరు గ్రామీణ మండలం సీతంపల్లె పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు లేరు. పెడన నియోజకవర్గంలోని సగానికి పైగా పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలు ఆదివారం హాజరుకాలేదు. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసి ఉండటంతో ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు.పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి, అంకంపాలెం, రౌతుగూడెం, పాములవారిగూడెం, గంగన్నగూడెం, టేకూరు, కొరకూరుల్లోని 9 పోలింగ్ కేంద్రాలు ఆదివారం తెరుచుకోలేదు.
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని 157, 158 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 వరకు, నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు, గోపాలపురం నియోజకవర్గంలోని వెదుళ్లకుంటలో ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు, రాజమహేంద్రవరం గ్రామీణం రాజవోలులో ఉదయం 11 గంటల వరకూ బీఎల్వోలు హాజరుకాలేదు. కాకుమాను మండలం వల్లూరులో మధ్యాహ్నం 11 గంటల 40 నిమిషాలకు బీఎల్వోలు రాలేదు. తెనాలి నియోజకవర్గం జగ్గడిగుంటపాలెం ఐటీఐ ప్రాంగణంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ బీఎల్వోలు రాలేదు.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!