tdp leaders arrest in gudiwada: గుడివాడ కొడాలి కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించి అందులో పాల్గొన్నవారు, తమపై దాడిచేసిన వారు ఒక్కరేనంటూ తెలుగుదేశం నేతలు వీడియోలు విడుదల చేశారు. తమపై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపిస్తూ.. అందుకు బాధ్యులైన మంత్రి బాధ్యులైన కొడాలినాని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు ఇదే అంశమై ఏలూరు రేంజ్ డీఐజీని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నారు. వైకాపా గుడివాడ రూరల్ మండలపార్టీ అధ్యక్షుడు జాన్‌విక్టర్ రాళ్లతో దాడి చేశారని, తన కారుపై కూడా రాయితో దాడి చేస్తున్న చిత్రం ఉందని బోండా ఉమ వెల్లడించారు. ఇదే వ్యక్తి మంత్రి కొడాలినానితో సన్నిహితంగా ఉన్న చిత్రాలను విడుదల చేశారు. సంక్రాంతి సంబరాల్లో కే కన్వెన్షన్‌లో డాన్సులు చేస్తున్న వీడియోను మీడియాకు చూపించారు. పార్టీకి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి బాధ్యులు నేరుగా దాడుల్లో పాల్గొన్నారని ఇదెక్కడి దౌర్జన్యమని ఆయన ప్రశ్నించారు. మంత్రికి ముఖ్య సన్నిహితుడుగా ఉన్న మరో నాయకుడు శశిభూషణ్ కూడా దాడిలో పాల్గొన్నారని ఆరోపిస్తూ సంబంధిత వీడియోలు, ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. ఆయన మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తుండటంతో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో దిగిన ఫొటోలను తెలుగుదేశం నేతలు ప్రదర్శించారు. ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే.. తెదేపా రెచ్చగొట్టినట్లు జిల్లా ఎస్పీ, డీఐజీ ఎలా చెబుతారని నేతలు ప్రశ్నించారు. తాము కొద్దిమంది మాత్రమే ఉన్నామని తమ వద్ద ఎలాంటి రాళ్లు కానీ ఆత్మరక్షణ పరికరాలు కూడా లేవని వివరించారు. వీడియోలు, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. గుడివాడలో జరిగిన సంఘటనల నిజ స్వరూపం, పోలీసులు అధికార పార్టీకి సహకరించిన వైనం వెలుగు చూస్తోందని నేతలు ధ్వజమెత్తారు. క్యాసినో వ్యవహారంపై ఈడీ, సీబీఐ తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
కాక రేపిన గుడివాడ క్యాసినో నిజనిర్థారణ వ్యవహారంలో పోలీసుల తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు ఉద్రిక్తత నివారణకు తీసుకున్న చర్యలు ఏకపక్షంగా ఉన్నాయి. ఒకవైపు తెదేపా నేతలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు.. మరోవైపు వైకాపా కార్యకర్తలకు మాత్రం ఎలాంటి షరతులు విధించకపోవడం పక్షపాతంగా వ్యవహరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం, పోలీసు చూస్తుండగానే కారు ధ్వంసం చేయడం, పోలీసు ఎదురుగానే వైకాపా కార్యకర్త తెదేపా కార్యకర్తపై ముష్టిఘాతాలకు దిగి రక్తం కారే విధంగా దాడులు చేయడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుడివాడ పట్టణంలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో క్యాసినో జరిగిందన్న ఆరోపణలపై తెదేపా నిజనిర్థరణ కమిటీ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. కమిటీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. పార్టీ కార్యాలయంపై దాడి చేసి వైకాపా కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సంఘటనల్లో వైకాపాను నియంత్రించడంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాశారని తెదేపా నాయకులు తీవ్రంగా ఆరోపించారు.
తెలుగుదేశం నిజనిర్థరణ కమిటీ గుడివాడ పట్టణం పర్యటించేందుకు ముందుగానే ప్రణాళిక ప్రకటించారు. కమిటీ సభ్యులుగా వర్లరామయ్య తోపాటు ఆరుగురు రాష్ట్ర నాయకులు ఉన్నారు. కె కన్వెన్షన్‌ను పరిశీలించి నివేదిక రాష్ట్ర కమిటీకి ఇవ్వాల్సి ఉంది. దీనికి అనుకూల వాతావరణం, ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేయలేదు. కె. కన్వెన్షన్‌లో అప్పటికప్పుడు అత్యవసరంగా గుడివాడ నియోజకవర్గం వైకాపా ఎస్సీ సెల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గుడివాడ, పరిసర మండలాల నుంచి వైకాపా కార్యకర్తలు హాజరుకావాలని నేతలు ఆదేశాలు ఇచ్చారు. అలా గుడివాడకు వందలాది కార్యకర్తలు చేరుకున్నారు. ముందస్తు ప్రణాళికతోనే తెదేపా పర్యటనను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుమిగూడారు. వారు ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీలు నిర్వహిస్తూ..నినాదాలు చేస్తూ తొలుత కె. కన్వెన్షకు, తర్వాత తెదేపా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు పోలీసులు సమావేశానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కానీ వందలాది సంఖ్యలో గుమిగూడారు. కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు.
తెదేపా నిజనిర్థరణ కమిటీ వస్తుందన్న సమాచారంతో వారిని అడ్డగించేందుకు భారీగా పోలీసుల్ని మోహరించారు. ముందుగా కంకిపాడు మండలం దావులూరు టోల్ గేటు, గుడివాడ-పామర్రు క్రాస్ రోడ్డు, గుడివాడ పట్టణంలోకి ప్రవేశం వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డంకులు సృష్టించారు. తెదేపా నేతలకు షరతులు విధిస్తూ.. వైకాపా కార్యకర్తలు సులభంగా చేరుకునే విధంగా సహకారం అందించారన్న విమర్శలు ఉన్నాయి. 8మంది డీఎస్పీలు, పదుల సంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలు కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొన్నా..., వ్యవహారం ఏకపక్షంగా మారింది. ప్రణాళిక ప్రకారం వైకాపా కార్యకర్తలు అన్ని మార్గాల ద్వారా తెదేపా కార్యాలయానికి సమీపానికి చేరుకున్నారు. వీధుల వెంట ర్యాలీలు నిర్వహిస్తూ.. నినాదాలు చేస్తూ వస్తున్నా.. వారిని పోలీసులు నిలువరించలేదు. మరోవైపు తెదేపా నేతలకు దాడులు జరిగే ప్రమాదం ఉందని, తక్షణం వెళ్లిపోవాలని స్వయంగా డీఎస్పీ హెచ్చరించడం విశేషం. వైకాపా కార్యకర్తల దాడుల్లో తెదేపా కార్యకర్తలు గాయపడితే.. తెదేపా నాయకులపైనే కేసులు నమోదుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. తెదేపా నాయకులు పామర్రు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోని పోలీసులు గుడివాడలో జరిగిన ఘటనలకు తెదేపా నేతలను బాధ్యులుగా చేస్తూ కేసులు నమోదుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రేపు డీఐజీని కలుస్తాం
అరెస్టు చేసిన తెలుగుదేశం నిజనిర్ధరణ బృందం సభ్యులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై.... శనివారం ఉదయం ఏలూరు డీఐజీ మోహన్ రావును కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
డీజీపీ సమాధానం చెప్పాలి - తెదేపా నిజనిర్ధారణ కమిటీ
కృష్ణాజిల్లా పామర్రు పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో వైకాపా నేతలను పోలీసులు కంట్రోల్ చేయలేరా? అని నిలదీశారు. ‘‘బొండా ఉమా కారును ధ్వంసం చేస్తుంటో పోలీసులు ఏం చేస్తున్నారు? తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటారా? వైకాపా వాళ్లు ఉన్నారు... మీపై దాడి చేస్తారు వెళ్లిపోండి అని పోలీసులే చెబుతున్నారు. పోలీసులు ఉన్నది ఎందుకు? ప్రజలను రక్షించడానికి కాదా? తెదేపా నేతల కార్లు ధ్వంసం చేస్తుంటే నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు. ఇదెక్కడి అన్యాయం. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలని గర్తించాలి. భారత రాజ్యాంగం తెలుగుదేశం పార్టీకి వర్తించదా? పోలీసుల కళ్లముందే దాడి జరిగినా పట్టించుకోరా? కొడాలి నాని పక్కన కూర్చునేందుకు సీఎంకు సిగ్గులేదా?’’ అని తీవ్రంగా స్పందించారు.
నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..