కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన అయ్యదేవర కాళేశ్వరరావు.. స్వాతంత్య్రోద్యమ తొలితరం తెలుగు నేతల్లో ప్రముఖులు. కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య సరసన నిలిచే అయ్యదేవర.. జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించిన రాజగోపాలాచారి, బెజవాడ గోపాలరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులుకు సమకాలికులు. 1906లో మద్రాస్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకొని, విజయవాడలో న్యాయవాదిగా స్థిరపడ్డారు. జమిందారీ చట్టంపై ఉన్న విశేష పరిజ్ఞానంతో పలువురు జమీందారులకు న్యాయవాదిగా పనిచేశారు. గాంధీజీ పిలుపుతో న్యాయవాద వృత్తిని వదిలేసిన అయ్యదేవర.. స్వాతంత్య్ర ఉద్యమంలో పూర్తిగా మమేకమయ్యారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సహా అనే పోరాటాల్లో పాల్గొన్నారు. సంగ్రామ సమయంలో ఆరున్నరేళ్లు కారాగార శిక్ష అనుభవించారు.
అయ్యదేవరను వెంటపెట్టుకునే...
1921లో విజయవాడ వేదికగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలకు గాంధీజీతో పాటు ఉద్దండులైన దేశ నాయకులంతా విచ్చేశారు. ఆ రోజుల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో.. కాళేశ్వరరావు పిలుపు మేరకు ప్రజలు ఇళ్ల ముందు లాంతర్లు పెట్టి, నగరాన్ని వెలుగులీనేలా చేశారు. ఈ ఘటనతో కాళేశ్వరరావు పేరు మహాత్ముడి దృష్టికి వెళ్లింది. ఆ తర్వాత మూడుసార్లు బెజవాడకు వచ్చిన గాంధీజీ.. అయ్యదేవరను వెంటపెట్టుకుని తిరిగారు. స్వాతంత్య్ర సమరం కోసం పిత్రార్జితంగా వచ్చిన వంద ఎకరాలు ఖర్చు చేసిన ఆయన.. తెలంగాణలో రజాకార్ల బాధలు తట్టుకోలేక విజయవాడలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి అయ్యదేవర ఆర్థిక సాయం అందించారు.
అతిపెద్ద మార్కెట్‌కు కాళేశ్వరరావు పేరు
పురపాలక అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా.. బెజవాడ నగరంపై అనేక రూపాల్లో తన ముద్ర వేశారు అయ్యదేవర. రామ్మోహన్ గ్రంథాలయం, దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం, ఆంధ్రరత్న భవన్, వన్‌టౌన్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్లు, విద్యుద్దీపాలు సహా మరెన్నో సౌకర్యాలు సమకూర్చారు. అనేక మందికి విద్యాదానం చేశారు. విజయవాడ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా.. నగరంలో అతిపెద్ద మార్కెట్‌కు కాళేశ్వరరావు పేరు పెట్టారు.
గాంధీ పిలుపుతో శాసనసభ అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు..