మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో వచ్చే మూడేళ్లలో వెనుకబడిన తరగతులను ముందు వరుసలో నిలుపుతామని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. వైకాపా రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, గుమ్మనూరు జయరామ్, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న పార్టీ తెదేపా అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
కృష్ణా జిల్లా
మహాత్మా జ్యోతిరావు పూలే130వ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రం వద్ద ఉప నుఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పూలమాలలు వేశారు. పూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం పరిపాలన చేస్తున్నారని అన్నారు.
అనంతపురం జిల్లాలో...
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అనంతపురంలో వైకాపా నాయకులు నివాళులు అర్పించారు. కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ధర్మవరంలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు సంఘ నాయకులు ఈశ్వరయ్య ఉరుకుంద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెనుకొండలోని మంత్రి శంకర్ నారాయణ స్వగృహంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
విశాఖ జిల్లాలో...
మహాత్మా జ్యోతీరావుపూలే వర్ధంతిని విశాఖలో నిర్వహించారు. సెయింట్ ఆంథోనీ స్కూల్ జంక్షన్లో గల పూలే విగ్రహానికి జాయింట్ కలెక్టర్ గోవిందరావు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.