కృష్ణా వరద నీరు జనావాసాల్లోకి రాకుండా నిర్మించేదే కరకట్ట. విజయవాడలోని యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు సుమారు 65 కిలోమీటర్లు పొడవు ఉంది. బీటీ రోడ్డుగా మారిన తర్వాత విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు ఆర్టీసు బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో మద్దూరు ఆంజనేయ స్వామి దేవస్థానం, మోపిదేవి, ఐలూరు వంటి పుణ్యక్షేత్రాల కారణంగా సందర్శకుల సంఖ్య పెరిగింది.
నాడు నిర్మానుష్య ప్రాంతం.. నేడు చిరు వ్యాపారులకు ఆవాసం - కరకట్ట
కృష్ణా కరకట్టపై చిరు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. పెరిగిన రవాణా సౌకర్యాలతో చిరు వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి శీతల పానీయాల వరకు, తాటి ముంజల నుంచి తాజా పండ్ల వరకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. చుట్టూ పర్యాటక ప్రాంతాలు ఉన్నందున ఎంతో మందికి జీవనాధారం లభిస్తోంది.
ధర తక్కువ.... నాణ్యత ఎక్కువ
కనీసం మంచినీళ్లు దొరకని ఈ మార్గంలో ఇప్పుడు అన్నీ లభిస్తున్నాయి. బడ్డీ కొట్లు, చిన్నపాటి రెస్టారెంట్లు వెలిశాయి. లంక గ్రామాల ప్రజలు తమ పంటలు తీసుకువచ్చి అమ్ముతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, తాటి ముంజలు విక్రయిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. రసాయనాలు లేని సరుకు కొనుగోలు చేసేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.
లాభాపేక్ష లేకుండా....బతుకుదెరువు కోసం స్వల్ప ఆదాయంతో కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు ఇక్కడి రైతులు. చిన్న చిన్న పాకలు వేసుకుని కాలానుగుణంగా వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కొంచెం అభివృద్ధి చేస్తే ఎన్నో లాభాలు
వ్యాపారాలు పెరిగినందున ప్రయాణికులు ఆగి మరీ బడలిక తీర్చుకుంటున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కృష్ణానది, పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్న ఈ మార్గం మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.