లాక్డౌన్ కారణంగా రెండు నెలల అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి... లండన్, జెడ్డా నుంచి ప్రయాణికుల విమానాలు చేరుకున్నాయి. లండన్ నుంచి 145 మంది ప్రయాణికులు రాగా... జెడ్డా నుంచి 78 మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
తొలిదశ...
వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో రాష్ట్రానికి విదేశాల నుంచి ఎలాంటి విమాన సర్వీసులు నడపలేదు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చే వారిలో కేవలం 16 మంది మాత్రమే రాష్ట్రానికి చెందిన వారు ఉండగా... వారి కోసం ప్రత్యేకంగా విమానం నడిపేందుకు ఎయిరిండియా అంగీకరించకపోవడంతో వారందరిని హైదరాబాద్ తరలించి అక్కడినుంచి ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చారు.
రెండో దశ...
రెండో దశలో మొత్తం 13 విమానాలు ఉండగా... వాటిలో రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. లండన్ నుంచి 145 మందితో కూడిన ఎయిరిండియా విమానం, సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ఈ విమానం 142 మంది ప్రయాణికులతో ఇక్కడకు చేరుకోగా... సౌదీ నుంచి వచ్చిన విమానంలో 78మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా మిగిలిన 64 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. వీరందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అధికారులు...అనంతరం వారిని బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.