ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాతాలకు 'అమ్మఒడి' నిధులు జమ చేయడంలో తీవ్ర జాప్యం - కృష్ణా జిల్లాలో అమ్మ ఒడి పథకం వార్తలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం కృష్ణా జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. అన్ని అర్హతలున్నా చిన్న చిన్న కారణాలవల్ల ఎంతోమంది ఈ పథకానికి దూరమయ్యారు. పథకం అమల్లోకి వచ్చి 10 నెలలు అవుతున్నా తమ ఖాతాలకు ఇంకా నిధులు జమ కాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

amma vodi in krishna district
ఖాతాలకు 'అమ్మఒడి' నిధులు జమ చేయడంలో తీవ్ర జాప్యం

By

Published : Oct 16, 2020, 5:05 PM IST

జిల్లా వ్యాప్తంగా జనవరిలో ప్రారంభమైన ‘అమ్మఒడి’కి 6,45,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అందులో 4,50,000 మందికి రూ.15వేలు చొప్పున వారి ఖాతాలకు నిధులు జమ చేశారు. మిగిలిన 1,95,000 మందికి ఇంకా జమ కావాల్సి ఉంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంఈవో కార్యాలయాలతో పాటు, పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు.

వివిధ కారణాలతో

కొందరు విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేసినందున వారి ఖాతాలకు డబ్బులు ఇంకా జమ కాలేదు. విద్యార్థి లేదా తల్లి రేషన్‌ కార్డులో తప్పులు ఉండడం, ఆధార్‌, బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడు తప్పుగా నమోదు చేయడం వంటి కారణాలతో కొంత మందికి ఇంకా నగదు అందలేదు. రేషన్‌ కార్డు ఉన్నవారు కొంత మంది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, 3 ఎకరాల పైబడి పొలం ఉందని, విద్యుత్తు బిల్లు ఎక్కువ వచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛను ఉందని, 4 చక్రాల వాహనాలు ఉన్నాయన్న కారణంతోను, ఎక్కువ కాలం పాఠశాలకు హాజరుకాని వారి ఖాతాల్లో నిధులు జమ చేయలేదు. ఇందులో అర్హులను కూడా తప్పుగా నమోదు చేయడం వలన వారికి ఈ పథకం వర్తించలేదు.

తప్పులు సవరించినా దక్కని ఫలితం

జనవరిలోనే తప్పుల సవరణకు ఆన్‌లైన్‌లో అవకాశం ఇచ్చారు. దీని ప్రకారం వీటిని గ్రామ సచివాలయాల్లో సరిచేశారు. అయినా అర్హులైన వారి ఖాతాలకు ఇప్పటికీ నిధులు జమ కాలేదు. జిల్లాలో ఒక్క పెనమలూరు మండలంలోనే అర్హులై పథకం అందని వారు సుమారు 8 వేల మంది ఉన్నారు. అలాగే పామర్రు, గుడివాడ, నందిగామ, నూజివీడు నియోజక వర్గాల పరిధిలో వేలాది మంది నిధుల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వచ్చే జనవరిలో రెండో విడత అమ్మఒడి పథకం అమలు కానుంది. ఈ నేపథ్యంలో ఇంకా తొలి విడత నిధులు జమ కాకపోవడంపై అర్హులైన తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇవీ చదవండి..

'మట్టి పనులకు 16 నెలలు తీసుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details