కంటికి రెప్పలా కాపాడిన ఆవు కళ్లముందే మృతి చెందడంతో చలించిన ఆ రైతు సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి.. దానిపై తనకున్న మమకారాన్ని చూపించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులో జరిగింది. గ్రామానికి చెందిన రైతు గుత్తికొండ వరప్రసాద్‌కి చెందిన ఆవుకు నెలలు నిండి దూడకు జన్మనిచ్చే సమయంలో పేగు మెలిపడి.. గర్భసంచి చీలడంతో అనారోగ్యానికి గురైంది.
వైద్యశాలకు తీసుకెళ్లినా దక్కని ప్రాణం..
ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆవు పడుతున్న బాధను చూసి చలించిన రైతు వరప్రసాద్.. దానిని కాపాడుకునేందుకు గన్నవరంలోని పశు వైద్య కళాశాలకు ప్రత్యేక వాహనంపై తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. అప్పటికే కడుపులో మృతి చెందిన దూడను బయటికి తీసి.. ఆవుకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వైద్య సహాయం అందించారు. ఆవు ఇంటికి వచ్చిన మరుసటి రోజే మృతి చెందడంతో వరప్రసాద్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వరప్రసాద్ దంపతులు మృతి చెందిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి.. శాస్త్రోక్తంగా తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:
COVID: ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం..ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్