రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో వినుకొండ ఒకటి. ఇక్కడి ప్రజలు బోర్లు, బావుల నీరు తాగి కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి తక్కువ వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 2018లో సాముదాయక ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధజలం అందించాలని నిర్ణయించింది. రూ.2కే 20 లీటర్లు అందించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రిమోట్ డిస్పెన్సరీ యూనిట్ (ఆర్‌డీయూ)ల ద్వారా ఏటీఎం తరహాలో కార్డు పెట్టి నీరు పట్టుకునేందుకు అవకాశం కల్పించారు. తొలి విడతలో రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసి విజయవంతం కావడంతో జిల్లాలోని చిలకలూరిపేట, పొన్నూరుతో పాటు వినుకొండలో వాటిని ఏర్పాటు చేసేందుకు అనుమతించారు.
పనులు పూర్తయినా..
వినుకొండ మండలం పెదకంచర్లలో రూ.2.20 కోట్లతో నిర్మించే యూనిట్‌కు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన ఎకరం స్థలంలో మదర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. బోర్లు వేసి నీటి పరీక్షలు చేసి కనెక్షన్ ఇచ్చారు. అక్కడ నుంచి చుట్టుపక్కల 24 ఆవాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ట్రాక్టర్ మౌంటెడ్ ట్యాంకర్లు సిద్ధంగా ఉంచారు. నీళ్లు పట్టుకునేందుకు వీలుగా 16 గ్రామాల్లో ఆర్‌డీయూలు ఏర్పాటు చేస్తారు. ఏడాది గడిచినా రంగులు మార్చారు తప్ఫ. ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేదు. నాడు ఎన్టీఆర్ సుజల పథకం పేరుతో ఉన్న బోర్డులు తొలగించి వైఎస్సార్ సుజల సురక్షిత మంచినీటి పథకంగా పేరు పెట్టారు. అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టి ఇప్పటికైనా శుద్ధజలం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయాగ్రామాల వారు కోరుతున్నారు.
రద్దుల పద్దు