ఏటీఎంలలో డబ్బుల్లేకుండా చేసింది మోదీనే అని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అమరావతిలో ఆరోపించారు. పోలవరాన్ని ఖాళీ ఏటీఎంగా చేసింది మోదీనే అనీ... ఆయనకు రఫేల్ ఒక ఏటీఎం,... రిలయన్స్ మరో ఏటీఎం అని పేర్కొన్నారు. ఏటీఎంలకు 'ఔట్ ఆఫ్ సర్వీస్' బోర్డులు మోదీ ఘనతే అని చురకలంటించారు. ఆయన మెడలో త్వరలోనే ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డు పడుతుందన్నారు. పెద్దనోట్ల రద్దును కుంభకోణంగా చేసింది మోదీ, షాలే అని విమర్శించారు. రైతులు, పేదలను భాజపా చాలా ఇబ్బందులు పెట్టిందన్నారు. నల్లధనం నియంత్రణ ముసుగులో అవినీతికి గేట్లెత్తారని ఆరోపించారు.కుటుంబ విలువలు తెలియని మోదీకి పాలనా యోగ్యత ఎక్కడిదని ప్రశ్నించారు. అవినీతిపరులు, నేరగాళ్లపై ప్రధానికి ఎక్కడలేని ప్రేమ అని ఎద్దేవా చేశారు.
వైకాపా మృగాల పార్టీ
జగన్‌కు ఓటేయకపోతే అద్దెకుండేవారి సామాన్లు బయట పడేయడం అమానుషమన్నారు. గాజువాకలో గర్భిణీపై దౌర్జన్యానికి... జగన్ సిగ్గుపడాలన్నారు. వైకాపాకు ఓటేస్తే మన ఇళ్లలో మనం అద్దెకుండాల్సిందేనని జోస్యం చెప్పారు. వైకాపా క్రూరమృగాల పార్టీ అని ప్రజలు భయపడుతున్నారన్నారు. జగన్ తాత రాజారెడ్డి క్రూరత్వంతో పులివెందుల బెంబేలు పడిందనీ.. క్రూరత్వంలో జగన్మోహన్‌రెడ్డి వాళ్ల తాతనే మించిపోయారని దుయ్యబట్టారు.