జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఓ వ్యక్తి మోసం చేశాడని గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఆరోపించింది. తన నుంచి రూ. 50 వేలు వసూలు చేశాడని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జగనన్న ఇళ్ల నిర్మాణానికి రూ. 50,000 తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టకుండా.. వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీకి విన్నవించింది.
వసంతారాయపురానికి చెందిన మల్లిక అనే మహిళకు 'ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పథకం'లో భాగంగా ఎటుకురులో సెంట్ స్థలాన్ని కేటాయించారు. అదే ప్రాంతంలో ఉండే బిల్డర్ అమరనాథ్ వచ్చి 'ఇంటి నిర్మాణం కోసం రూ.1.8 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది, మొదటి విడతలో ఇల్లు నిర్మించుకుంటే మంచింది' అని మల్లికకు చెప్పాడు. సరే అని రూ.2 లక్షలకు ఇంటి నిర్మాణం చేసేలా అమరనాథ్తో మల్లిక ఆమె తల్లి రమణ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ ప్రకారం మొదటి విడతగా రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. రూ. 20 వేలు ఒకసారి.. 30 వేలు ఒకసారి ఆ మహిళలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. ఇదేంటి అని అడిగితే ఇసుక రాలేదు అంటూ కాలం వెళ్లబుచ్చాడని బాధితురాలు తెలిపింది. ఇంటి నిర్మాణం ప్రారంభించలేదని గట్టిగా అడిగినందుకు 'మరో రూ.50 వేలు ఇస్తేనే పనులు మొదలు పెడతాను లేదంటే చేయను' అని బెదిరిస్తున్నాడని వాపోయింది.