OPPOSITION LEADERS HOUSE ARREST : సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు తెలుగుదేశం, జనసేన నేతల కదలికలపై ఆంక్షలు విధించారు. వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారనే అనుమానంతో టీడీపీ, జనసేన నేతలను అరెస్టు చేశారు. ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు.
సోమవారం అర్ధరాత్రి నుంచే పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఫోన్లు చేసి స్టేషన్కు రావాలని ఒత్తిడి చేశారు. రాకపోయే సరికి వారిని తీసుకువచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేం లేదని టీడీపీ, జనసేన నేతలు రెండు రోజులుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని నిర్బంధించారు. కనీసం ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోవటంపై టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనం నవ్వుకుంటున్నారు: అధికారులకు, అధికార పార్టీ నాయకులకు ఎందుకు అంత అభద్రతా భావమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటనకు వస్తుంటే జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని నిలదీశారు. సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని.. ఏ చట్టం చెబుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా జగన్కు భయమని.. అందుకే ఆయన తెనాలి పర్యటనకు వస్తుంటే ఎటువంటి ప్రకటనలు చేయకుండా కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి తెనాలికి జగన్ హెలికాప్టర్‌లో వెళ్లడాన్ని సైతం మనోహర్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.