గుంటూరు జిల్లాలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కావాలనుకుంటే కేసీఆర్ జగన్ తరఫున ప్రచారం చేయవచ్చని....అంతకు ముందు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఈ ప్రాంతానికి రావాలని అన్నారు. కేసీఆర్‌కి ఆంధ్ర ప్రజలంటే ప్రేమ కాదని కేవలం జగన్ ఒక్కడంటేనే ప్రేమని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... నారా లోకేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు, మల్లెంపూడిలో పర్యటించారు. ప్రస్తుతప్రధానికి ఇంకా 45 రోజులే సమయం మిగిలి ఉందని... ఆ తర్వాత తెలుగుదేశం నిర్ణయించే వ్యక్తే దిల్లీ పీఠం ఎక్కుతారని చెప్పారు. 25 కి 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే దేశ ప్రధానిని నిర్ణయించడం చంద్రబాబు చేతులో ఉంటుందన్నారు. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో వారినే ప్రధానిని చేస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.