Indian Racing League in Hyderabad : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరం మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమైంది. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సన్నద్దతలో భాగంగా.. ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పలు ప్రమాదాలు, రేసర్లకు గాయాలు కావడంతో టెస్ట్ రైడ్స్ మాత్రమే నిర్వహించారు.
ఈరోజు నుంచి పెట్రోల్ కార్లతో జరిగే రేసింగ్‌లో 12 కార్లు, 6 బృందాలు పాల్గొననున్నాయి. ఇందులో స్వదేశీ, విదేశీ రేసర్లు ఉన్నారు. పెట్రోల్ కార్లు 240 స్పీడ్‌తో వెళ్తాయని.. ఎలక్ట్రిక్ కార్లయితే మాగ్జిమమ్ స్పీడ్ 320 వరకూ ఉంటుందని నిర్వహకులు తెలిపారు. రేసింగ్‌ను 7,500 మంది వరకూ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రేసింగ్ దృష్ట్యా హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11 తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.