ఓ ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక పోతున్నామని గుంటూరు జిల్లాలో పోలీస్ సిబ్బంది డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీలకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అధికారులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 15 మంది సిబ్బందిని కేటాయించారు. ఆ బృందాల పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించారు. కొద్దినెలల కిందట జిల్లాకు వచ్చిన ఆ అధికారి వారాంతపు సెలవులు అడిగితే బెదిరిస్తున్నాడని ఆ ఫిర్యాదులో వాపోయారు.
సెలవు అడిగితే వీఆర్‌లోకి పంపిస్తానంటున్నాడని...పోలీసు మాన్యువల్‌లో వీక్లీ ఆఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటూ నిలదీస్తున్నాడని తెలిపారు. కనీసం సీఎల్ కూడా ఇవ్వటం లేదని, కేవలం అత్యవసర సమయంలో ఇస్తానంటూ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు.
జిల్లాలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్న క్రమంలో తమ బృందాలతో పెద్దగా పని ఉండదని, ఆ సమయంలోనైనా వారాంతపు సెలవులు ఇవ్వాలని అడిగితే మీకు చేతనైంది చేసుకోమంటున్నాడని పేర్కొన్నారు. ఇ.ఎల్.ఎఫ్.పి.లు జిల్లా ఎస్పీ మంజూరు చేసినా వాటిని ఆ అధికారి రద్దు చేయిస్తున్నాడని ఆరోపించారు.