"కొత్త బిల్లులకు" తలుపుల మూత.. ఇప్పటికీ పెండింగ్లోనే వేల కోట్ల రూపాయల బిల్లులు AP CFMS WEBSITE : రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(Comprehensive Finance Management System) వెబ్‌సైట్‌ను నిలుపుదల చేసింది. పనులు, సరఫరాలు, ఇతర సేవలకు బిల్లులు చెల్లించాలంటే.. సీఎఫ్ఎంఎస్(CFMS) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి డబ్బులు చెల్లిస్తారు. గతంలో ఫస్ట్ ఇన్ - ఫస్ట్ అవుట్ -ఫిపో(FIFO) పద్ధతిలో బిల్లుల చెల్లింపు జరిగేది. నిధుల లభ్యత మేరకు ఒకరి తర్వాత మరొకరికి అధికారులు చెల్లింపులు చేసేవారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొందరి అండతోనే చెల్లింపులు సాగుతున్నాయి. దానికి తోడు నిధులు అందుబాటులో లేకపోవడంతో... ఎవరికి బిల్లు మంజూరు అవుతుందో, ఎవరికి కావడం లేదో తెలియక లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పుడు వెబ్‌సైట్‌లో అసలు బిల్లు సమర్పించేందుకే అవకాశం లేకుండా చేశారు. ప్రస్తుతం పీఏవో(PAO) స్థాయి నుంచి బిల్లులు ముందుకు కదలడం లేదని సమాచారం. కానీ సాంకేతికంగా సమస్య ఉన్నట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆర్థికశాఖ వరకు ఈ బిల్లులు చేరడం లేదు.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ చివర్లో కొన్ని రోజుల పాటు ఇటువంటి పరిస్థితి ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఇది రోజుల నుంచి నెలల వ్యవధికి మారిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫిబ్రవరి 15 నుంచే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకన్న ముందుగానే బిల్లుల స్వీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం 35 వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.
తాజాగా వచ్చిన బిల్లులను వాటిలో చేర్చాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక 2023-24 ఆర్థిక ఏడాదికి అలాంటి అవకాశం ఉంటుందా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్లులు రాక చిన్న గుత్తేదారుల నుంచి పెద్ద సరఫరా దారుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు. కొందరు కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానల నుంచి ఉత్తర్వులు వెలువడుతున్నా.. ప్రభుత్వం నుంచి తగిన చర్యలు ఉండటం లేదు. ఈ విషయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు కూడా దాఖలవుతున్నాయి. ఐఏఎస్ అధికారులు కూడా న్యాయస్థానం ముందు హాజరై సంజాయిషీలు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు.
ఇవీ చదవండి: