Anganwadi Workers Phone Problems In Andhra Pradesh: ఏదైనా నూతన వస్తువు కొనగోలు చేస్తున్నమంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. నాణ్యత, భవిష్యత్తు, నాణ్యత వంటి అంశలాను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకటికి రెండు చోట్ల ఆరా తీసి కొంటాం. అదే ప్రజాధనంతో కొనేదైతే ప్రభుత్వం ఇంక ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్ల కోసం కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్లలో ఎమీ ఆలోచించకుండా కొనుగోలు చేసినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ కనిపించవు. అంత రహస్యం ఎందుకో తెలియదు.
అంగన్వాడీ కార్యకర్తల కోసం ఒక్కో స్మార్ట్ ఫోన్‌ను సాఫ్ట్‌వేర్, నిర్వహణ ఖర్చులతో కలిపి 12వేల 695 రూపాయలకు కొనుగోలు చేశారు. కార్యకర్తలు, సూపర్వైజర్లకు మొత్తం 72 కోట్లతో వీటిని గతేడాది అక్టోబరులో పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు వాటిలో సగానికి పైగా ఫోన్లు మూలకు చేరాయి. సరిగా పనిచేయటం లేదని.. సొంత ఫోన్లలో పనిచేస్తున్నామని వారు కార్యకర్తలు, సూపర్వైజర్లు అంటున్నారు.
అనంతపురంలో నెల రోజుల క్రితం ఓ అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వం అందించిన ఫోన్లో లబ్ధిదారుల వివరాలన్నీ నమోదు చేశారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఉన్నట్లుండి స్విచాఫ్ అయింది. తర్వాత ఆన్ చేస్తే వివరాలన్నీ గల్లంతయ్యాయి. అప్పటి నుంచి ఆ కార్యకర్త ప్రభుత్వ ఫోన్‌ను వాడడం లేదు. గిరిజన ప్రాంతానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారులకు అందించే రోజువారీ సేవల వివరాలను యాప్‌లో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కావడం లేదు. ఒక్కోసారి మర్నాడు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో విసిగిపోయి 18వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొనుక్కుని వివరాలు నమోదు చేస్తున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేటప్పుడు వాటి సామర్థ్యంపై ఓ అంచనా ఉండాలి. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ ఉన్న ఫోన్లు ఇచ్చారు. వైఎస్సారు సంపూర్ణ పోషణ యాప్, పోషణ ట్రాకర్, నెలవారీ నివేదికను అందించేందుకు.. ఎన్పీఆర్ యాప్, పాల వివరాలను పొందుపరిచేందుకు మిల్క్ యాప్ ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పిల్లల ఎత్తు, బరువు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల వివరాలు, పాలు, గుడ్లు నిల్వ వివరాలు, అంగన్వాడీ కార్యకర్తల హాజరు, ప్రీస్కూల్ పిల్లల హాజరు నమోదు చేయాలి. గర్భిణులు, ప్రీస్కూల్ పిల్లలు భోజనం చేసే ఫొటోలు, రక్తహీనత ఉన్న గర్భిణులకు మాత్రల పంపిణీ, కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలు, గుడ్లు, వైఎస్సార్ కిట్స్, బాలామృతం, పాలు సరఫరా అయినప్పుడు వాటి ఫొటోలు, కార్యకర్తలు ఇళ్లకు వెళ్లే ఫొటోలను యాప్ ద్వారానే అప్లోడ్ చేయాల్సి ఉంది.