తూర్పు గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 11.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమో దైంది. అత్యధికంగా పెదపాడు 70.6 మి.మీ., కుక్కునూరు 59.8 మి.మీ. కురిసింది. ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు భారీ వర్షాలు, వరదలను తట్టుకున్న జిల్లా వాసులకు మరో మూడు రోజులు అలాంటి ముప్పే ఎదురుకానుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే మళ్లీ వర్షాలు ఆరంభమైనందున అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
గోస్తనీ, యనమదుర్రు డ్రెయిన్లలో వరద ఉద్ధృతంగా ఉంది. పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఆక్వా చెరువులన్నీ ఏకం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నివాసాలు ముంపునకు గురికావడంతో చాలా గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
* యనమదుర్రు వరద ప్రభావం భీమవరం, గణపవరం, నిడదవోలు, మొగల్తూరు, ఉండి, పాలకోడేరు ప్రాంతాలపై ఎక్కువగా ఉంది. భీమవరంలో దుర్గాపురం, లంకపేట, చినపేట, మెంటేవారితోట, నాయుడుపాలెం, తోకతిప్ప, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్, లోసరి, ఎల్‌ఎన్‌వీపురం తదితర గ్రామాలు ముంపులో ఉన్నాయి. 15 గ్రామాల్లో ఆక్వా చెరువులు ఏకమయ్యాయి. ఉండి పరిధిలోని యండగండి, ఉప్పులూరు ముంపునకు గురికావడంతో 50 కుటుంబాలకు చెందిన 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు.
* గణపవరం పరిధిలోని కేశవరం, పిప్పర అప్పన్నవీడు, ఎస్.కొండేపాడు పరిధిలోని పంట పొలాలు మునిగిపోయాయి. పాలకోడేరు మండలానికి చెందిన కోరుకొల్లు, మైప, గరగపర్రు గ్రామాలు జలమయమయ్యాయి. ఉండి, పాలకోడేరు, గణపవరం పరిధిలో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. సమీపంలోని యండగండి తదితర ప్రాంతాల్లో పంట పొలాలు, ఆక్వా చెరువులకు నష్టం వాటిల్లింది.
* ఆకివీడు పరిధిలోని చినకాపవరం డ్రెయిన్ నీటిని ఉప్పుటేరు తీసుకోకపోవడంతో కోళ్లపర్రు, దుంపగడప, సిద్ధాపురం గ్రామాల్లో ఆక్వా చెరువులు ఏకమయ్యాయి. తణుకు పరిధిలోని దువ్వ, మండపాక, నిడదవోలు పరిధిలోని ఉండ్రాజవరం ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంది.
* గోస్తనీ వరద తీవ్రత స్థిరంగా ఉన్నా పెనుమంట్ర మండలంలో శనివారం భారీ వర్షం పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెనుమంట్ర, సోమరాజు ఇల్లింద్రపర్రు, మాములూరు గ్రామాల్లోకి నీరు చేరింది. ఇదే స్థాయిలో ఆదివారం కూడా వర్షం కురిస్తే జుత్తిగ, మల్లెపూడి, నత్తారామేశ్వరం, గరువు తదితర గ్రామాలూ మునిగే అవకాశాలున్నాయి.
ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదలకు జిల్లాలోని 48 మండలాల పరిధిలోని 437 గ్రామాల్లో 28,204 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నీట మునిగింది.
భీమవరం..బిక్కుబిక్కు..!
భీమవరం పట్టణంలో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతికి పలు ప్రాంతాలు ముంపునకు గురవడంతో కొందరు ఇళ్లలోని విలువైన సామగ్రి సహా రోడ్డుపైకి వచ్చి గడుపుతున్నారు. భీమవరం-తాడేపల్లిగూడెం రహదారే వారికి ఆవాస ప్రాంతమైంది. వీధి దీపాలు పూర్తిగా వెలగకపోవడంతో వాహనాల హెడ్‌లైట్ల కాంతులే వెలుగునిస్తున్నాయి.