Rooster Fights and Gambling in Andhra Pradesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో కోడిపందాలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లు, కోడి పందేలు చూసేందుకు వచ్చిన జనంతో బరుల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గెలుపు నీదా నాదా అంటూ పెద్ద మొత్తంలో పందేలు కాశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంప్రదాయ క్రీడలతో పల్లెలు కోలాహలంగా ఉన్నాయి. జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. పలుచోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లతో కోడి పందేల బిరులు కిటకిటలాడాయి. తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం వేల్పూరు గ్రామాల్లో పందేలు నిర్వహించారు. కోడిపందాలతోపాటు గుండాట, ఇతర జూద క్రీడలు నిర్వహించారు.
ఊపందుకున్న కోడి పందేలు - చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
ఏలూరు శివారు కోడెలు, కొమరవోలు, జాలిపూడి, మాదేపల్లి, పాలగుడెం, చాటపర్రు, చోదిమెళ్లలో కోడిపందాలు జరిగాయి. కోడి పందాలతోపాటు బరుల వద్ద గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున డబ్బులు చేతులుమారాయి. నిర్వాహకులు బరుల వద్ద బౌన్సర్లును, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మద్యం ఏరులై పారింది. గత రెండు రోజులుగా కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిపందాలు జరగకుండా అడ్డుకుంటామని చెప్పిన పోలీసులు జాడ కనిపించకపోగా, ప్రభుత్వ అధికారులు నియమించిన గ్రామ కమిటీలు, వలంటీర్ల సైతం పత్తాలేకుండా పోయారు.