సీఎం సహాయనిధికి రావులపాలెం గ్రామస్థుల విరాళం - రావులపాలెం గ్రామ వార్తలు
కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. ఆ బాటలోనే తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం గ్రామస్థులు సీఎం సహాయనిధికి విరాళం ఇచ్చారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన దాతలు లక్ష రూపాయల విరాళం అందజేశారు. ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులకు 3000 మాస్కులను ఉచితంగా అందించారు. రావులపాలెం గ్రామానికి చెందిన స్వగృహ కన్స్ట్రక్షన్స్ అధినేత కర్రి వీర్రెడ్డి, ద్వారంపూడి సుధాకర్ రెడ్డిలు లక్ష రూపాయల చెక్కును శాసనసభ్యుడు, పీయూసీ ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో జాయింట్ కలెక్టర్ డా.లక్ష్మిషాకు అందజేశారు. అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మి టైల్స్ ప్రొప్రైటర్ సూర్య కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల గ్రామాల అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకు సుమారు రూ.50,000 విలువైన 3 వేల మాస్కులు శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలకు ఇచ్చారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు