ఇతని పేరు పురాకుల రాజశేఖర్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సత్తెమ్మ కాలనీవాసి. రాజశేఖర్ చిన్నప్పటి నుంచి అందరిలాగానే చలాకీగా ఉండేవాడు. వివాహం అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇతని ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. పరీక్ష చేసిన వైద్యులు గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయని చెప్పారు. మార్పిడి చేయాలని.. కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని అన్నారు.
సాధారణ పనులతో పాటు.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు రాజశేఖర్. తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో అప్పులు చేసి మరీ బాగుచేయించుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. అయినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజురోజుకూ అతని పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. రాజశేఖర్ తన దయనీయ పరిస్థితి గురించి గతంలో పాదయాత్రలో పెద్దాపురం వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత... ఇప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డికి వివరించాడు. జగన్ తనను ఆదుకుంటానని పూర్తి భరోసా ఇచ్చారని.. కనీసం తనకు పింఛను ఇచ్చి తన కుటుంబానికి అండగా నిలవాలని వేడుకుంటున్నాడు.