పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ స్థలం, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముమ్మిడివరం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ విమర్శలకు తావిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ వద్ద స్థానిక మహిళలు తమకు ఇంటిపట్టాలు రాకుండా వాలంటీర్లు అడ్డుకుంటున్నారని.. అర్హులైన చాలామంది జాబితాలో లేరంటూ ఫిర్యాదు చేశారు. లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉండాలన్నా.. గృహ నిర్మాణానికి ప్రభుత్వం సాయం అందలన్నా వాలంటీర్ చేతిలో ఎంతో కొంత సొమ్ము పెట్టాల్సి వస్తుందని వాపోయారు. నియోజకవర్గంలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాలలో పట్టాల పంపిణీ సాగుతోంది. ప్రతి మండలంలోనూ 300 నుంచి 500 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తూ...పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్.