రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అన్నవరంలో ప్రమాదకరంగా పంపా నది
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని పంపా జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 105 అడుగులు కాగా.. ప్రస్తుతం 104 అడుగులకు చేరింది. అధికారులు మూడు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీరు జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలన్నీ అన్నవరం నుంచి దారి మళ్లించారు.
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 4 లక్షల 7 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి నదీ తీర ప్రాంతాల్లో పర్యటించారు. ముక్త్యాల గ్రామంలో రహదారిపైకి నీరు చేరి... అధికారులు ట్రాక్టర్‌పై గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంచికచర్లలో అధికారులతో సమావేశమైన కలెక్టర్... కృష్ణా నదీ పరీవాహక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రాత్రికి నదిలోకి 6.8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నందున పల్లపు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరులో ప్రజల ఇబ్బందులు
వారం రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని మినీ బైపాస్ రోడ్... కరెంట్ ఆఫీస్ సెంటర్.. డై కాస్ రోడ్డు తదితర సెంటర్లలో వాననీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.