సెప్టెంబర్ నుంచి రచ్చబండ.. ఆ గ్రామం నుంచే శ్రీకారం
ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబరు నెలలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీనికి సంబధించి త్వరలోనే షెడ్యూలు ఖరారు కానుంది. రచ్చబండ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
సెప్టెంబరు 2 తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అమెరికా పర్యటన నుంచి సీఎం తిరిగి రాగానే ఈ షెడ్యూలు ఖరారు కానుంది. సెప్టెంబరు 2వ తేదీ నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకోనున్నట్టు సమాచారం. ఆ రోజున దివంగత నేత రాజశేఖర రెడ్డి వర్థంతి సందర్భంగా పులివెందుల వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించి రచ్చబండకు బయల్దేరి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగతంలో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని అణుపల్లిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అదేగ్రామం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.