FUTURE OF EDUCATION: యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అనేక స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే నైతిక విలువలతో పాటు, ఆరోగ్యం పెంపొందించుకునే శిక్షణ జోడించి వృత్తివిద్య అందించే సంస్థలు వేళ్లమీద లెక్కపెట్టేవే. ఈ తరహాలోనే నిరుపేద యువతను అక్కున చేర్చుకొని భావి పౌరులుగా తీర్చిదిద్దుతూ కార్పొరేట్ సంస్థలతోనే ఔరా అనిపించుకుంటున్నాయి ఈ 2 సంస్థలు. వీటిల్లో శిక్షణ పొందిన విద్యార్థులు వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా నిస్వార్థ ఫౌండేషన్ యువత కోసం అనేక సేవ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా 10 పాసైన విద్యార్థులకు తదుపరి చదువుకోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్విహిస్తూ మూడేళ్లుగా సేవలందిస్తోంది. ఈ సంస్థ సేవలను గుర్తించిన అభయ పౌండేషన్ వారితో కలిసి పని చేయాలని భావించింది. అలా నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ 2 ఫౌండేషన్లు కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులకు ఈ మేరకు ముందుకు వెళ్తున్నారు.
యువత, విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించే ప్రతిపాదనలను ఆయా సంస్థలకు వివరించడంతో కాంటినెంటల్ కాఫీ నుంచి లారస్ ల్యాబ్స్ వరకు పలు సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధులు ఇవ్వటానికి ముందుకు వచ్చాయి. అలా సమకూరుతున్న నిధులతో మూడేళ్లుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రాసిన గ్రామీణ పేద విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహించాయి ఈ సంస్థలు. ఆ పరీక్షల ద్వారా 120 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వారిని 2 గ్రూపులుగా సూపర్ 60 టీంలను ఏర్పాటు చేశారు. 40 రోజుల పాటు ఈ విద్యార్థులకు త్రిపుల్ ఐటీ, పాలీసెట్ తదితర విద్య కోసం పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాయి.