ప్రణాళికలోనే లేదు..
కుండపోత వర్షాలతో సర్వస్వం కోల్పోయిన అనంతపురం జిల్లా రైతుల నష్టం.. కేంద్ర ప్రభుత్వ జాబితాలో చోటుకు నోచుకోని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పంట దిగుబడినే కాకుండా కనీసం పశుగ్రాసం కూడా దక్కించుకోలేని అనంత రైతుల వద్దకు వెళ్లాలనే ప్రణాళికే.. కేంద్ర బృందం షెడ్యూల్లో లేదు. రాష్ట్రంలో కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే నష్టం ఎక్కువగా జరిగినట్లు కేంద్రానికి ప్రతిపాదించిన అధికారులు.. అనంతపురంలో జరిగిన నష్టం తీవ్రతను చూపలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర బృందం జిల్లాకు రాకపోతే విమర్శలెదుర్కోవలసి వస్తుందని భావించిన ముఖ్యమంత్రి, కేంద్రాన్ని అభ్యర్థించి అనంతపురానికి రప్పించారు. కేవలం సీఎం చెప్పారు కాబట్టే.. కేంద్ర బృందం హెలీకాప్టర్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కేవలం రెండు గ్రామాల్లో రెండు కమతాలను మాత్రమే పరిశీలించి, ఇద్దురు రైతులతో ఒక్కో నిమిషం చొప్పున మాట్లాడి పర్యటన ముగించారు.
ఆ నివేదిక అధారంగానే..
రాయలసీమ జిల్లాల్లో కరవుతోనో, అధిక వర్షాలతోనో పంట నష్టం జరిగినపుడు కేంద్ర బృందం పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనావేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర సర్కారు రాష్ట్రానికి పరిహారం నిమిత్తం నిధులు విడుదల చేస్తుంది. అయితే ఈసారి పర్యటన జరిగిన తీరు అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. పంట నష్టం అంచనా వేయటానికి వచ్చిన బృందంలో కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీస్ అధికారి ఒక్కరు కూడా లేకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పర్యటనకు వచ్చిన ఇంటర్ మినీస్టీరియల్ కేంద్ర బృందంలో ఆర్ బి కౌల్ ఆర్థికశాఖ కన్సల్టెంట్ కాగా, డా.కె.పొన్నుస్వామి వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఉన్నారు.
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు..