ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తరగతిగది పెచ్చులూడి విద్యార్థికి గాయాలు

కర్నూలు జిల్లా బురాన్‌దొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల తరగతి గది పైకప్పు నుంచి పెచ్చులూడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలవగా... మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవలే ఈ పాఠశాల భవనానికి నాడు-నేడు నిధులు వెచ్చించి మరమ్మతులు చేయించడం గమనార్హం.

students-injured-cause-of-classroom-roof-felldown
తరగతిగది పెచ్చులూడి విద్యార్థికి గాయాలు

By

Published : Sep 1, 2021, 8:12 AM IST

కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం బురాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం మండల ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో పైకప్పు నుంచి పెచ్చులు ఊడి విద్యార్థులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. 5వ తరగతి గదిలో 38 మంది విద్యార్థులు బల్లలపై కూర్చొని రాసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో మహేంద్ర తలకు, నందకిశోర్‌రెడ్డి ముక్కుకు గాయమైంది.

గాయపడ్డ మహేంద్ర

విద్యార్థులిద్దరికి సి.బెళగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పాఠశాల భవనానికి నాడు-నేడు నిధులు వెచ్చించి ఇటీవల పైకప్పునకు మరమ్మతులు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అయినా పెచ్చులు ఊడిపడటంతో విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో 144 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థి మహేంద్ర కర్ణాటక ప్రాంతం నుంచి ఇటీవల బురాన్‌దొడ్డి గ్రామానికి వచ్చారు. సరైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడంతో పేరు నమోదు కాలేదు.

ఊడిపడిన తరగతి గది పైకప్పు పెచ్చులు

నాడు - నేడు పనుల్లో నాణ్యత లోపంతోనే...

మొన్నీమధ్యే నాడు - నేడు నిధులు వెచ్చించి పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టినట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరమ్మతుల పేరుతో తూతూమంత్రంగా పనులు చేపట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... నాడు-నేడు పనుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:కత్తులతో దుండగుల దాడి.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details