చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీసు స్టేషన్ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాను అనే యువకుడు గురువారం ఉదయం పక్కింటి యువతిని ఫోన్ నంబరు అడిగాడు. ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వెంటనే ఆమె తల్లి.. చాను ఇంటి వద్దకు వెళ్లి హెచ్చరించింది. యువకుడి ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలకు తెలిపింది.
అనంతరం... చాను ఆ కుటుంబంపై కక్షగట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం చేశాడు. అతని అరుపులతో పొరుగింటి వారు వచ్చి ప్రశ్నించగా తుపాకీ పేల్చాడు. ఓ తూటా పక్కింటి తలుపును పాక్షికంగా ధ్వంసం చేసింది. భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.