విధి విధానాలపై ఊసేది? - vishaka
విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. వాల్తేరు డివిజన్ రాష్ట్రానికి ఇస్తేనే న్యాయం జరుగుతుందని మేధావి వర్గాలు అంటున్నాయి. రైల్వే శాఖ మాత్రం దీనిపై పూర్తి స్థాయి విధివిధానాలను వెల్లడించలేదు.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతో మందడుగు పడింది. ఈ జోన్ కి సంబంధించి వాల్తేర్ డివిజన్ విభజనపై రైల్వే మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సినవివరణపైన, విధి విధానాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కీలకంగా మారిన దాదాపు 11 వేలకు పైగా ఉద్యోగుల విభజనపైన స్పష్టత రావాల్సి ఉంది.
లాభాల వాల్తేరు వాళ్లకా?
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు విధివిధానాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రకటన వెలువరించినప్పటికీవాటిని మాత్రంబయటపెట్టలేదు. విధాన పరంగా స్థూలంగా రైల్వే జోన్ ఎలా ఏర్పాటవుతుతోందో అన్న అంశాలను మాత్రమే మంత్రి పియూష్ గోయోల్ ప్రకటన ద్వారా వెల్లడించారు. వాల్తేర్ డివిజన్ ఉనికి ఉండదని స్పష్టం చేశారు. వాల్తేర్ డివిజన్ అసలు ఉనికే లేకుండా చేయడం వల్ల 125 ఏళ్ల చరిత్ర ముగిసిపోవడమే కాక ఇక్కడ వచ్చే రెవెన్యూ కి బాగా గండి పడుతోందన్న ఆందోళనలు జోరందుకున్నాయి. జోన్ ఇచ్చి డివిజన్ తీసేయడమేంటనేది వివిధ వర్గాల ప్రశ్న.
ఆర్ఆర్బీ ఉంటుందా?
వాల్తేరు డివిజన్ లో దాదాపు 11 వేల పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎవరిని ఏరకంగా విభజిస్తారన్నది కూడాస్పష్టత లేదు. గతంలో జోన్లుఏర్పాటుచేసినప్పుడు ముందుగా ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని కేటాయింపులు పూర్తిచేశారు. ఇప్పుడూ అదేవిధంగా ఉంటుందన్నది రైల్వే వర్గాల భావన. ప్రస్తుతం విశాఖలో ఉన్న డీఆర్ఎం కార్యాలయం దక్షిణకోస్తా రైల్వే జోనల్ మేనేజర్ కార్యాలయంగా ఉన్నతిని పొందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విశాఖలో కూడా ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతీయులకు, రాష్ట్ర నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది. వీటిన్నింటి మీద స్పష్టత ఇచ్చే రైల్వే బోర్డు విధివిధానాలపైనే అందరి దృష్టినెలకొంది.