విశాఖ విమానాశ్రయ భూముల అంశం చర్చనీయాంశమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయోనన్నది ఆసక్తిగా మారింది. 2002లో విమానాశ్రయ అవసరాలకు వీలుగా 74 ఎకరాలను రాష్ట్రం కేటాయించింది. వాటిని తిరిగి ఇచ్చేయాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి సన్నాహాలు సాగుతున్న నేపథ్యంలో అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సదరు భూముల్ని వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఆ 74 ఎకరాల్లో:విశాఖ విమానాశ్రయానికి ఉన్న 375 ఎకరాల్లో రాష్ట్రం ఇచ్చిన 74 ఎకరాలూ ఉన్నాయి. వీటిని వివాహనాలు నిలిపే స్థలాలకు, అంతర్గత రహదారుల నిర్మాణానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారు. అవన్నీ ప్రాంగణం అంతర్భాగంగా మారాయి. వాటిని వేరు చేస్తే విమానాశ్రయ రూపురేఖలు మారిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏం చేస్తారో:భోగాపురం విమానాశ్రయ నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. అయినా విశాఖలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుండడంతో కేంద్రం ఆ భూముల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఉత్కంఠగా మారింది. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి ఇస్తే... వాటిని ఇతర సంస్థలకు కేటాయిస్తే యుద్ధ విమానాల శిక్షణ కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.