తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు నేతలకు ఫోన్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపిన విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తాతారావు బీటెక్ పూర్తి చేసి ప్రముఖ నాయకులకు ఇలా ఫోన్‌తో బెదిరింపు సందేశాలు పంపుతూ ఉంటాడని నర్సీపట్నం ఎస్ఐ రామారావు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే.... తెదేపా సీనియర్ నేత అయ్యన్నతో పాటు పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రేవంత్ రెడ్డిలతో పాటు పలువురిని ఫోన్ సందేశాల ద్వారా బెదిరించినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు.
తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని చరవాణి ఆధారంగా గతంలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత అతను...మాజీ మంత్రి అయ్యన్నకు గత నెల రెండో వారంలో బెదిరింపు మెసేజ్‌లు పంపడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సందేశంలో అయ్యన్నను చంపేసి ప్రయత్నం జరుగుతోందని సమాచారం ఉందని ఆ యువకుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు. ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు నర్సీపట్నం పోలీసులు తెలిపారు.