ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 31, 2020, 5:22 AM IST

ETV Bharat / city

మీ సినిమాలో నేనుండలేను- నాకు సినిమానే తెలుసు!

జనసేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. పవన్‌ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని తప్పుబట్టిన ఆయన... నిలకడ లేని విధానాలు సరికాదని విమర్శిస్తూ రాజీనామా చేశారు. లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన పవన్‌.. సినిమాల్లోకి తిరిగి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు.

laxminarayana resign to janasena party
laxminarayana resign to janasena partylaxminarayana resign to janasena party

జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

భాజపాతో స్నేహబంధం ద్వారా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశిస్తున్న జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్‌కు రాజీనామా లేఖ పంపిన ఆయన... అధినేత గతంలో పూర్తిగా ప్రజాసేవకే అంకితం అని చెప్పి... ఇపుడు సినిమాల్లోకి వెళ్లటం సరికాదని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌వి నిలకడలేని రాజకీయాలని తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో తన వెంట ఉన్న జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా వారికి అండగా ఉంటానన్నారు.

లక్ష్మీనారాయణ పార్టీలో ఉంటూనే వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తున్నారని జనసేనలో పలువురు ముందు నుంచే భావిస్తున్నారు. ఎవరైనా పార్టీ విధానాలను మాత్రమే ప్రచారం చేయాలని పవన్ కూడా ఓ సమావేశంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పార్టీకి - లక్ష్మీ నారాయణకు మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. పార్టీ కీలక సమావేశాలకు సైతం లక్ష్మీనారాయణకు పిలుపు రావడం లేదు. అమరావతిపై జరిగిన కీలక సమావేశం, భాజపాతో పొత్తు వ్యవహారాల్లో లక్ష్మీ నారాయణ జాడ కనిపించలేదు. జనసేనలో పవన్ తర్వాత తనదైన స్థాయి కలిగిన లక్ష్మీనారాయణను పట్టించుకోకపోవటం ఆయన సన్నిహితులను ఆవేదనకు గురిచేసింది. లక్ష్మీనారాయణతో పాటే జనసేనలో చేరిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి రాజగోపాల్ సహా పలువురికి తగిన ప్రాధాన్యం దక్కటం లేదనే అభిప్రాయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన పవన్‌.... సినిమాల్లోకి వెళ్లడం సరికాదన్న విమర్శలపైనా స్పందించారు. తనపై ఆధారపడిన అనేక కుటుంబాల కోసం, పార్టీని నడిపించేందుకు... సినిమాలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. విద్యుత్‌ ప్రాజెక్టులు, సిమెంట్ గనులు, పాల పరిశ్రమలు తనకు లేవన్న పవన్‌... ఎక్కువ జీతం లభించే ప్రభుత్వ ఉద్యోగినీ కానన్నారు. తనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడం ఒక్కటేనని తెలిపారు. లక్ష్మీనారాయణ తన రాజీనామాలో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తే బాగుండేదని పేర్కొన్నారు.

జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్.. లక్ష్మీనారాయణ తీరుపై విమర్శలు గుప్పించారు. నిలకడ అంటే పార్టీ బీ ఫాం పై పోటీ చేసి, ఓడిపోగానే తెల్ల కాగితంపై రాజీనామా చేసి వెళ్లిపోవడమేనా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిని ప్రశ్నించడం చేతకావడం లేదని విమర్శించారు. సిద్ధాంతాలపై నడుస్తున్న వ్యక్తులకు నేడు కాకపోతే రేపైనా ప్రజలు అండగా నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

లక్ష్మీనారాయణ అలా ఆలోచించి ఉంటే బాగుండేది: పవన్

ABOUT THE AUTHOR

...view details