ఏపీలో 350 కోట్ల రూపాయలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టినట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. విశాఖలో ఎమ్ఎస్ఎమ్ఈ టెక్నాలజీ సెంటర్ను వర్చువల్ విధానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. వర్చవల్ విధానంలో మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, మౌలికాభివృద్ధి కేంద్రాలు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ టెర్మినళ్లను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
టెక్నాలజీ సెంటర్ల ద్వారా చిన్న పరిశ్రమలకు మరింత ఊతం వస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. నౌకా నిర్మాణం, ఫ్యాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో ఈ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. కరోనా సమయంలో రీ-స్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు ఏపీ అండగా నిలబడిందని కేంద్ర మంత్రికి గౌతమ్ రెడ్డి తెలిపారు. 259 కోట్లతో కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలో జువెలరీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఫర్నిచర్ తయారీ క్లస్టర్, మాచవరంలో పప్పుధాన్యాలకు, కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ఆమోదించినట్టు మంత్రి తెలిపారు.