ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షం... రైతులకు తీరని నష్టం

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ఆరుగాలం పండించుకున్న పంటలు నేలపాలయ్యాయి. చేతికి వచ్చిన పంట అందుకునేలోపే వర్షం అతలాకుతలం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

heavy rain in ap
heavy rain in ap

By

Published : Apr 29, 2020, 4:36 PM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతన్నకు చేతికొచ్చిన పంట చేజారిపోయింది. ఇంకో 20 రోజుల్లో పంట చేతికి అందేదని అకాల వర్షం అతలాకుతలం చేసిందని రైతులు బోరుమంటున్నారు. విజయనగరం జిల్లాలో కురిసిన వర్షానికి అరటి తోట నాశనమైంది. నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కడప జిల్లాలో తెల్లవారుజామున భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని మెట్ట ప్రాంతమైన రాయచోటి లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట, రైల్వేకోడూరు ,పులివెందుల, రాజంపేట, రామపురం ప్రాంతాల్లో ఈ వర్షం వల్ల ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. గాలుల దెబ్బకు మామిడి పూర్తిగా రాలిపోయింది.

కొన్ని గ్రామాల్లో గుడిసెలు, రేకుల షెడ్లు గాలికి తిరగబడ్డాయి. మరికొన్ని చోట్ల నివాసాలు సైతం కూలిపోయాయి. రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, లింగాల ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి

భారీగా వీచిన గాలులకు కర్నూలు జిల్లా మహానంది మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన అరటి, మునగ, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. గాలి ధాటికి ఈ పంటలు నెలకొరిగి అన్నదాతకు అపారనష్టాన్ని తెచ్చి పెట్టాయి.

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొలాల్లో ఉన్న వరి పంట నీటమునిగింది. కూరగాయల పంటలకు అపార నష్టం జరిగింది.

ఇవీ చదవండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details