Construction Workers Unity : ఎవరో వచ్చి తమకు సాయం చేస్తారని వారు ఎదురుచూడలేదు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కూడా నిలిచిపోయింది. అలాంటి సమయంలో సమష్టిగా వారి సంక్షేమానికి వారే చేయిచేయికలిపారు. కష్టపడి సంపాదించిన దాంట్లోంచే కొంత కొంత కూడబెట్టుకున్నారు. భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. అంతా కలిసి తమ సంక్షేమానికి తామే పునాదులు వేసుకున్నారు విశాఖ జిల్లాకు చెందిన తాపీమేస్త్రీలు.
విశాఖ జిల్లా తుని, పాయకరావుపేట పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు కొన్నేళ్ల క్రితం ఓ సంఘంగా ఏర్పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీన సమావేశమై కష్టసుఖాలు చర్చించుకుంటారు. ప్రతి సభ్యుడు తన వంతుగా నెలనెలా రూ.50 చొప్పున పొదుపు చేస్తుంటారు. ఇలా పొదుపుచేసిన సొమ్ముతో సంఘం కోసం స్థలం కొని ఓ భవనం నిర్మించుకున్నారు. ఇందులో పై భాగంలో తమ సంఘం కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఫ్లోర్‌ను కల్యాణమండపంగా తీర్చిదిద్దారు. బయట వ్యక్తులకు దీన్నిఅద్దెకు ఇస్తుంటారు. ఈ భవనంలోనే 9 దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చారు. దుకాణాలు, కల్యాణ మండపం ద్వారా వచ్చే అద్దెలతో సహచరులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువచేసే భవనానికి ఈ శ్రమజీవులు యజమానులయ్యారు.
గత ప్రభుత్వంలో చంద్రన్న బీమా పథకం ద్వారా భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లల పెళ్ళిళ్లు, ప్రసూతి ఖర్చులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందేది. ప్రమాదవశాత్తు చనిపోయినా, వైకల్యం పొందినా, గాయాలపాలైనా 5 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి వచ్చేది. గత రెండున్నరేళ్లుగా ఈ సంక్షేమ పథకాలేవీ అందడం లేదు. కార్మికులు ఇబ్బందులు పడుతుండటంతో సంఘం తరఫునా తామే సంక్షేమ బాధ్యతను భుజాన వేసుకున్నారు.
" ఈ ప్రభుత్వం వచ్చాక మా భవన నిర్మాణ కార్మికులను కాస్త నిర్లక్ష్యమే చేసింది. మా 2వేల కుటుంబాల సభ్యులను ఆదుకోవాలని ఆలోచనతోనే మేము ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. కార్మికుల కుమార్తెలకు పెళ్లి కానుకగా పసుపు, కుంకుమ, చీర, కొంత నగదు అందజేస్తున్నాం. పనిచేయలేని ముసలివాళ్లకు నెలకు రూ.200 పింఛను ఇస్తున్నాం. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుని కుటుంబానికి మట్టి ఖర్చులకు రూ.5 వేలు ఇస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందకపోవడంతో మా సంక్షేమం కోసం సంఘం తరుపున మేమే ఈ పనులు చేస్తున్నాం. " -నారాయణరావు, అధ్యక్షుడు భవన నిర్మాణ సంఘం
కార్మికులు పొదుపుచేసుకున్న మొత్తంలోనే ప్రసూతి సాయానికి 5 వేలు, పెళ్లి కానుకగా పసుపు, కుంకుమ, చీర, కొంత నగదు అందజేస్తున్నారు. పనిచేయలేని వృద్ధులకు..నెలకు 200 రూపాయల చొప్పున ఫించను వీరే ఇస్తున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుని కుటుంబానికి ...మట్టి ఖర్చులకు 5 వేల రూపాయలు ఇస్తున్నారు.