కొందరు పదో తరగతి ఫెయిలయ్యారు. మరికొందరు ఏడోతరగతితోనే ఆపేశారు. కంప్యూటర్ గురించి కనీస అవగాహన లేదు. అయినా వేల మందికి ‘సైబర్’ టోపీ ఎలా పెడుతున్నారు..? అనే ప్రశ్న రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసుల (Rachakonda police investigation)ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి సమాధానం కనుక్కునే ప్రయత్నంలో ఉండగా ఝార్ఖండ్ ‘దేవగఢ్’ జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను అక్కడి ఇన్‌ఫార్మర్లు చూపించడంతో అవాక్కయ్యారు. మోసాలెలా చేయాలి? బ్యాంక్ అధికారులుగా ఎలా మాట్లాడాలి? ఉత్తుత్తి ముఖాముఖిలు ఎలా నిర్వహించాలి? తదితర అంశాలపై వాటిలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలుసుకుని (Rachakonda police investigation) కంగుతిన్నారు. 16 కేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది దేవగఢ్ ముఠా సభ్యులను రాచకొండ సైబర్‌క్రైమ్స్ దర్యాప్తు బృందం సోమవారం నగరానికి తీసుకు వచ్చి రిమాండ్‌కు తరలించింది. దర్యాప్తు బృందం (Rachakonda police investigation) దృష్టికి వచ్చిన అంశాలు అందరినీ నివ్వెరపరిచేలా ఉన్నాయి.
ఇంటికో సైబర్ నేరస్థుడు
దేవగఢ్ జిల్లాలోని అనేక గ్రామాల్లో దాదాపుగా ఇంటికో సైబర్ నేరస్థుడు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొందరు తల్లిదండ్రులు కూడా అటువైపు ప్రోత్సాహిస్తున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వీరిలో చాలామంది ఓ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా పనిచేస్తుండటం గమనార్హం. పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఒకేసారి 500 సిమ్ కార్డులు తెచ్చుకుంటున్నారు. ఒకరిని మోసం చేయగానే.. ఆ సిమ్ కార్డును పక్కన పారేస్తున్నారు.
స్థానిక పోలీసులకు చెప్పి వెళ్తే...
ఫలానా చోట నిందితులున్నట్లు మన పోలీసులు గతంలో టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించి అక్కడి పోలీసులకు చెప్పారు. అక్కడికెళ్లేసరికి నిందితులు కనిపించలేదు. ఇదే అనుభవం నాలుగైదు సందర్భాల్లో ఎదురైంది. దీంతో అక్కడి పోలీసులకు చెప్పకుండానే మరో చోటుకు వెళ్లగా అక్కడ నిందితులు చిక్కారు. దీంతో పోలీసులు మోసగాళ్లకు సహకరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.