TDP Leaders Fire On YSRCP Govt:చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదంటూ మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రోజా ఒత్తిడిలో నారా భువనేశ్వరీపై అవాకులు చవాకులు పేలుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. చిత్తూరులో వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని...నారా భువనేశ్వరి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. పదవి కోసం కక్కుర్తి పడే రోజాకు భువనేశ్వరిపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. భువనేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తప్పుని ఎత్తిచూపిన సుబ్బారావు గుప్తా అనే వైకాపా కార్యకర్తపై దాడి చేయటమే కాకుండా అతనికి మతిస్థిమితం లేదని దుష్ప్రచారం చేస్తారా? అని మంత్రి బాలినేనిపై మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మండిపడ్డారు. ఆడబిడ్డలను దూషించటం తప్పని చెప్పటమే సుబ్బారావు చేసిన తప్పా ? అని ప్రశ్నించారు. సుబ్బారావు ఘటనతో పాటు, రాజంపేటలో లక్ష్మీకాంతప్రసాద్, విశాఖలో జగదీశ్వరుడి ఘటనలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారన్నారని నిలదీశారు.