గడచిన 29 నెలల వైకాపా ప్రభుత్వపాలనలో సాగునీటిరంగానికి ఎంత ఖర్చుపెట్టారో, ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో, ఎందరు నిర్వాసితులను ఆదుకున్నారో చెప్పాలంటూ.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. సాగునీటి రంగానికి సంబంధించిన పనులు, రైతులకు ఏం ఒరగబెట్టారనే పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నాయా అంటూ నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులకోసం ముఖ్యమంత్రే నేరుగా ప్రధానమంత్రితో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సాగునీటి రంగాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి కమిషన్ల కోసమే ప్రాజెక్టుల పనులంటూ నాటకాలాడుతున్నాడని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చినవారిని చెట్లపాలు చేశారని, తన తండ్రి విగ్రహాలు పెట్టుకునే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా.. వారికి అవసరమైన ఒక్క ఇంటిని కూడా కట్టించకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు.