ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపాలో 'మహా' జోష్.. ప్రభుత్వ వైఫల్యాలపై ముప్పేట దాడికి వ్యూహం !

ఊహించినదాని కంటే మహానాడు ఘన విజయం సాధించడం, రాష్ట్రం నలుమూలల నుంచీ పార్టీ కార్యకర్తలు ప్రభంజనంలా తరలిరావడంతో..తెదేపా నాయకులు, శ్రేణుల్లో విజయోత్సాహం వెల్లివిరుస్తోంది. శ్రేణుల్లో ఆ ఉత్సాహం కొనసాగించేందుకు మరింత దూకుడుగా ముందుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారించనుంది. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒంగోలు మహానాడు రూపంలో బయటపడిందని తెదేపా నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయడం ద్వారా.. తమకు తెదేపా అండగా ఉందన్న భరోసాను ప్రజల్లో మరింతగా కల్పించాలని భావిస్తున్నారు.

తెదేపాలో 'మహా' జోష్
తెదేపాలో 'మహా' జోష్

By

Published : May 30, 2022, 4:22 AM IST

పార్టీ మహానాడు ఊహించినదాని కంటే ఘన విజయం సాధించడం, రాష్ట్రం నలుమూలల నుంచీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులతో పాటు, సాధారణ ప్రజలూ ఒక ప్రభంజనంలా స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలిరావడంతో తెదేపా నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ విజయోత్సాహం వెల్లివిరుస్తోంది. దీంతో శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మరింత దూకుడుగా ముందుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణపై అధిష్ఠానం దృష్టి సారించనుంది. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఒంగోలు మహానాడు రూపంలో బయటపడిందని తెదేపా నాయకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయడం ద్వారా.. తమకు తెదేపా అండగా ఉందన్న భరోసాను ప్రజల్లో మరింతగా కల్పించాలని భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో.. ఇక విరామం లేకుండా పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయడం, సంస్థాగత లోటుపాట్లను సవరించుకోవడం, ఇబ్బందుల్ని వెంటనే సరి చేసుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించనుంది.

శ్రేణులు సిద్ధం.. నేతలదే ఆలస్యం:మూడేళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆంక్షలు, నిర్బంధాలు, కేసుల భయం నుంచి తెదేపా కేడర్‌ బయటపడింది. తాడోపేడో తేల్చుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదల మహానాడులో ప్రతి కార్యకర్తలోనూ కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సభకు లక్షల్లో జనం తరలిరావడం పార్టీలో ఉత్సాహం పెంచింది. అయితే ఇంకా కొన్నిచోట్ల నాయకుల్లోనే జడత్వం ఉంది. వివిధ రాజకీయ సమీకరణాల్ని, వ్యాపార అవసరాల్ని, ఇతర ప్రయోజనాల్ని బేరీజు వేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో ఉద్ధృతంగా మమేకం కాని నాయకులు.. కేడర్‌లో ఉత్సాహాన్ని చూసిన తర్వాతైనా క్రియాశీలకంగా మారడమో, మరొకరికి అవకాశమివ్వడమో చేయాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. "పార్టీ మహానాడుకు, బహిరంగసభకు అంత స్పందన వస్తుందని మేమే ఊహించలేదు. గత మూడేళ్లలో పార్టీ కేడర్‌ బయటకువచ్చి మాట్లాడితే.. అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారో, ఏ కేసుల్లో ఇరికిస్తారోనని భయపడేది. తెదేపా మహానాడులో ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై వేసిన భారాలపై తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజాగ్రహం బయటపడింది. తమ ఆగ్రహాన్ని, ఆవేదనను ప్రకటించేందుకే వారు వెల్లువలా వచ్చారు" అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మినీ మహానాడు:మహానాడు ఘనవిజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మినీ మహానాడు నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మినీ మహానాడులను నిర్వహిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలోనే ప్రకటించారు. మరోవైపు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ మూడు రోజుల కార్యక్రమం చేపట్టాలన్న ప్రతిపాదన ఉన్నట్లు ఓ సీనియర్‌ నేత చెప్పారు. "బూత్‌ స్థాయి నుంచి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ, అనుబంధ సంఘాల పదవుల్లో ఉన్న 60-70వేల మందితో ఒక రోజు సమావేశం నిర్వహణ. రెండో రోజు జిల్లాలో నాయకుల మధ్య ఎక్కడైనా విభేదాలు, సమస్యలు ఉంటే పార్టీ అధినేత వారితో మాట్లాడి పరిష్కరించి, అందరూ సమష్టిగా పనిచేసేలా చూడటం. వైకాపా ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల వంటి వాటిని సందర్శించడం మూడో రోజు కార్యక్రమంగా చేపట్టాలన్నది ఆలోచన" అని ఆయన వివరించారు.

ఇన్‌ఛార్జుల నియామకంపై తక్షణ కసరత్తు:ఇప్పటికీ పార్టీ ఇన్‌ఛార్జులు లేని నియోజకవర్గాలు 30-35 వరకు ఉన్నాయి. అక్కడ ఇన్‌ఛార్జుల నియామకంపై అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. "ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. క్రియాశీలకంగా లేని ఇన్‌ఛార్జులను పిలిచి, చివరిసారి హెచ్చరిస్తాం. అప్పటికీ మారకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తాం. ఎలాంటి ఇబ్బందులూ లేని, గట్టి నాయకత్వం ఉన్న ఎ-గ్రేడ్‌ నియోజకవర్గాలనుకున్న వాటిలో 20-30 తొలి దశలో ఎంపిక చేస్తాం. అక్కడ పూర్తిస్థాయిలో పార్టీ కార్యాలయం, దానికి ఒక ఇన్‌ఛార్జిని ఏర్పాటు చేసి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండేలా చూస్తాం. మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులు మెరుగుపరుచుకుంటూ పది చొప్పున ఎ-గ్రేడ్‌ నియోజకవర్గాల జాబితాను పెంచుకుంటూ వెళతాం" అని పార్టీ ముఖ్య నేత ఒకరు వివరించారు.

యువతకు మరింత ప్రాధాన్యం:పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు వారికే ఇస్తామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి మహానాడులో యువతకు ప్రాధాన్యం పెంచారు. మహానాడుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత చూపిన ఉత్సాహమే కార్యక్రమ ఘనవిజయానికి కారణమైంది. "యువతరంలోనూ పార్టీకి చాలా ఆదరణ ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక ప్రజలు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. వారంతా మళ్లీ తెదేపా అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. నిబద్ధత, గెలవాలన్న ఆకాంక్ష, పట్టుదల ఉన్న యువతకు నాయకత్వ స్థానాల్లోనూ ఎక్కువ అవకాశాలివ్వడం వల్ల యువతను మరింతగా ఆకట్టుకోగలం" అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

లోకేశ్‌ పాదయాత్ర ?: ప్రజలపై వైకాపా వేసిన మితిమీరిన భారాలు, ఛార్జీల పెంపుపై నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని తెదేపా భావిస్తోంది. ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర చేస్తారన్న ప్రచారం పార్టీలో విస్తృతంగా ఉంది. మహానాడు సందర్భంగా విలేకరులతో లోకేశ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు పాదయాత్రపై ప్రశ్నిస్తే.. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు సిద్ధమని బదులిచ్చారు. "ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలోనే కాదు.. నియోజకవర్గ స్థాయిలోనూ వైకాపా ఎమ్మెల్యేలపై పోరాడాలి" అని పార్టీలోని మరో సీనియర్‌ నేత చెప్పారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details