తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు (mp gvl Narasimha Rao) వ్యాఖ్యానించారు. తెలుగు భాషను చిన్నచూపు చూడడం.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమేనని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. "తెలుగు భాష.. మన సంస్కృతి, ఉనికికి ఆధారం. ఆ భాషను చిన్నచూపు చూడటం... తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే" అని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా..?
మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్లకు ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఎక్కడిది? అని ముఖ్యమంత్రిని జీవీఎల్ ప్రశ్నించారు. మన భాషపై మనకే మక్కువ లేకపోవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అని నిలదీశారు. బ్రిటిష్ వారు పరిపాలించినపుడే ఇంత సాహసం చేయలేదని... ఆంగ్లభాషకు ఎవ్వరూ వ్యతిరేకం కాదని అన్నారు. విదేశీ భాష మోజులో మన భాషను మరుగున పడేయాలనుకోవటం భావ్యం కాదని పేర్కొన్నారు.
విద్యార్థులకు శాపంగా..
తెలుగు మాధ్యమంలో చదువుకునే వేలాదిమంది విద్యార్థులకు ఇది శాపంగా మారిందన్నారు. ఒకవైపు.. ఉన్నతవిద్యతోపాటు సాంకేతిక విద్యను మాతృ భాషల్లో బోధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆంగ్లమయం చేయాలనుకోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
జాతీయ విద్యా విధానానికి విరుద్ధం