ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ మెట్రో ఆవిర్భవించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14 వేల 132 కోట్లు వెచ్చించారు. ఇందులో ఎల్.అండ్.టీ రూ.12 వేల 674 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఆస్తుల సేకరణ కోసం ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్లు సర్దుబాటు వ్యయనిధిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును టెండర్లలో ఎల్.అండ్.టీ మెట్రో దక్కించుకుంది.
2012 జూన్‌లో ఒప్పందం
మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పనులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని 2012 జూన్‌లో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. 2012 జూలై 5న అపాయింటెడ్ డేగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 జూలై 4 నాటికి పనులన్నీ పూర్తి చేయాల్సి ఉండగా అలైన్మెంట్ వివాదాలు, ఆస్తుల సేకరణలో జాప్యం, రైల్వేల అనుమతి తదితర కారణాలతో కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వేర్వేరు దశల్లో ఉండడం వల్ల ఎల్.అండ్.టీ మెట్రో అభ్యర్థన మేరకు అప్పట్లో సర్కారు నిర్మాణ పనుల పూర్తికి 2018 నవంబర్ వరకు ఒప్పందం పొడిగించింది.