ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లకు చెందిన పాలక వర్గాల కాలపరిమితిని పెంచకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం సర్కారుకు ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఎన్నికలు నిర్వహించేంత వరకు తమ పాలకవర్గాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు జారీచేయాలన్న కృష్ణా జిల్లాకు చెందిన శ్రీరాంపురం పటేల్, పీఏసీఎస్ అధ్యక్షురాలు లక్ష్మినర్సమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.
పిటిషనర్ తరపు వాదన
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సర్కారు పీఏసీఎస్‌ల కాలపరిమితిని పెంచకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ సభ్యులకు పీఏసీఎస్‌ల కార్యకలాపాలేవి తెలియవన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేంత వరకు పాలకమండలి కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
సర్కారు తరపు వాదన
సర్కారు తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. పీఏసీఎస్‌లు ఆర్థిక బలోపేతం సాధించే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 40 శాతం పీఏసీఎస్‌లు నష్టాల్లో ఉన్నాయని, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లోపాల్ని సవరించి సరైన మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నామని చెప్పారు. అందులో భాగంగా పీఏసీఎస్ కాల పరిమితిని పొడిగించకూడదనే విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు.