HC orders to CS: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనెల 4న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పర్యటనలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని/ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది.
హెలికాప్టర్ దిగేందుకు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, దిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మొదట ఆమోదం తెలిపినా తర్వాత వెనక్కి తీసుకుందని గుర్తు చేసింది. అయితే హెలికాప్టర్ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించలేమని పేర్కొంది. ఎంపీ రఘురామకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచినందున రాష్ట్ర పోలీసులూ రక్షణ ఇవ్వాలంటూ ఆదేశించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 4న భీమవరంలో తన హెలికాప్టర్ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం హైకోర్టులో అత్యవసరంగా (హౌజ్ మోషన్) వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.