రైతులు, పేద ప్రజలు, కార్మికుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ... బిల్లులు, నిధుల వ్యయం చెల్లించడంలో జగన్ ప్రభుత్వం తీవ్ర అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో పారదర్శకత కోసం తెదేపా సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) ను అమలు చేయగా, వైకాపా తన స్థూల ఆర్థిక నిర్వహణను రహస్యంగా కొనసాగించడానికి మాత్రమే ఈ వ్యవస్థను నిలిపివేసిందని ఆక్షేపించారు.
'రాజధానిని మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు'
బిల్లులు, నిధుల వ్యయం చెల్లించడంలో జగన్ ప్రభుత్వం తీవ్ర అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఆరోపించారు. రైతులు, పేద ప్రజలు, కార్మికుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాజధానిని మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఖజానాలో 13 వేల కోట్లు, లాక్డౌన్ కాలంలో కేంద్రం ద్వారా 20 వేల కోట్లు బదిలీ అయితే రైతులు, కార్మికులకు ఉపశమనం కలిగించడానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు ఏమి జరుగుతుందో తెలియదని విమర్శించారు.
అమరావతి నుంచి 20 లారీల సామాన్లను తరలించి, విశాఖపట్నంలో మాజీ మంత్రి అల్లుడికి చెందిన కళాశాల ప్రాంగణంలో దింపారని ఉమా ఆరోపించారు. మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో రాజధానిని మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖపట్నం ఓషన్ ఫ్రంట్ హిల్స్‌లోని ప్రధాన ప్రభుత్వ భూములను బిల్డ్ ఏపీ పేరిట బినామీల ద్వారా స్వాధీనం చేసుకున్నారని దుయ్యబట్టారు.